KL Rahul: లక్నో సూపర్ జెయింట్స్ ఓనర్‌ను కలిసిన కెప్టెన్ కేఎల్ రాహుల్.. దొరకని భరోసా!
- జట్టులోనే కొనసాగాలనుకుంటున్నట్టు రాహుల్ వెల్లడి
- రిటెన్షన్‌పై హామీ ఇవ్వని ఓనర్ సంజీవ్ గోయెంకా
- గత సీజన్లో దారుణంగా విఫలమైన లక్నో సూపర్ జెయింట్స్
గతేడాది ఐపీఎల్ సీజన్ లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు ఆశించిన స్థాయిలో కలిసి రాలేదు. పేలవ ప్రదర్శన చేసి కనీసం నాకౌట్ దశకు కూడా చేరలేకపోయింది. గతేడాది చెత్త ప్రదర్శనల పరంపరలో ఒకసారి కెప్టెన్ కేఎల్ రాహుల్‌పై జట్టు ఓనర్ సంజీవ్ గోయెంకా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినప్పటికీ వచ్చే సీజన్లో కూడా లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకే ఆడాలని కేఎల్ రాహుల్ భావిస్తున్నాడు. తన మనసులో మాటను జట్టు యజమాని సంజీవ్ గోయెంకాకు తెలిపినట్టు కథనాలు వెలువడుతున్నాయి. కోల్‌కతాలోని ఆర్పీజీ ప్రధాన కార్యాలయానికి వెళ్లి గోయెంకాను కలిసిన అతడు రిటెయిన్ అవ్వాలని భావిస్తున్నట్టు చెప్పాడని, అయితే రిటెన్షన్‌పై భరోసా లభించలేదని తెలుస్తోంది.
కేఎల్ రాహుల్ వెళ్లి గోయెంకాను కలిశాడని, జట్టుతోనే కొనసాగాలని భావిస్తున్నట్టు స్పష్టంగా చెప్పాడని లక్నో సూపర్ జెయింట్స్ జట్టు వ్యవహారాలపై అవగాహన ఉన్న ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యుడు ఒకరు పేర్కొన్నారు. అయితే రిటెన్షన్‌పై రాహుల్‌కు గోయెంకా ఎలాంటి హామీ ఇవ్వలేదని, బీసీసీఐ రిటెన్షన్ పాలసీపై పూర్తి స్పష్టత ఇచ్చే వరకు ఎలాంటి ప్రణాళికలు రూపొందించకూడదని జట్టుపై జట్టు మేనేజ్మెంట్ భావిస్తున్నట్టు చెప్పారు. కాగా ఈ వార్తలపై లక్నో యాజమాన్యం స్పందించలేదు.
కాగా కేఎల్ రాహుల్ నాయకత్వంలో లక్నో సూపర్ జెయింట్స్ తొలి రెండు సీజన్లలో నాకౌట్ దశకు చేరుకుంది. అయితే నాడు జట్టు మెంటార్‌గా వ్యవహరించిన గౌతమ్ గంభీర్‌కే ఈ ఘనత దక్కుతుందనే వ్యాఖ్యానాలు వినిపించాయి. గౌతమ్ గంభీర్ వ్యూహాత్మకంగా జట్టును నడిపించాడని చర్చ నడిచింది. దీనికి తగ్గట్టు గంభీర్ లేని ఈ ఏడాది సీజన్లో లక్నోసూపర్ జెయింట్స్ దారుణంగా విఫలమైంది. దీంతో రాహుల్ కెప్టెన్సీపై విమర్శలు వచ్చాయి. అంతేకాదు వ్యక్తిగత ప్రదర్శన విషయంలో కూడా రాహుల్ తీవ్రంగా నిరాశపరిచిన విషయం తెలిసిందే.