Andhra Pradesh: మీకు మీరుగా తిరిగిస్తేనే మంచిది.. ప్రభుత్వ భూముల ఆక్రమణదారులకు ఏపీ మంత్రి హెచ్చరిక
- ఆంధ్రప్రదేశ్ లో కూడా హైడ్రా తరహా వ్యవస్థ ఏర్పాటు చేయాల్సి వస్తుందని వార్నింగ్
- ఐదేళ్ల పాలనలో అన్ని వ్యవస్థలూ నాశనం అయ్యాయన్న మంత్రి నారాయణ
- సెప్టెంబర్ 13న మరో 70 క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామని వెల్లడి
ఐదేళ్ల వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్ లోని అన్ని వ్యవస్థలూ నాశనమయ్యాయని మంత్రి నారాయణ ఆరోపించారు. నాటి సీఎం ఇంటికే పరిమితం కావడంతో వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ అక్రమాలకు పాల్పడ్డారని చెప్పారు. అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ప్రభుత్వ భూములను, పార్కులను ఆక్రమించారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఇలా ప్రభుత్వ భూములను ఆక్రమించిన వాళ్లు స్వచ్ఛందంగా ముందుకొచ్చి భూములను అప్పగించాలని సూచించారు.
లేదంటే తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రా తరహాలో మన రాష్ట్రంలో కూడా ఓ ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేసి అక్రమార్కుల భరతం పడతామని హెచ్చరించారు. ఈమేరకు మంగళవారం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ.. వచ్చే నెల 13న రాష్ట్రవ్యాప్తంగా మరో 70 అన్న క్యాంటీన్లను ప్రారంభిస్తామని చెప్పారు. విశాఖలోని వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ను కూడా ఆధునికీకరిస్తామని వివరించారు. రుషికొండ భవనాలపై సీఎం చంద్రబాబు దృష్టి సారించారని, వాటి విషయంలో ఏం చేయాలనే దానిపై అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి నారాయణ వివరించారు.