K Kavitha: కవిత బెయిల్ బాండ్స్ అంగీకరించిన రౌస్ అవెన్యూ కోర్టు... రిలీజ్ ఆర్డర్స్ జారీ
- కవిత పూచీకత్తు బాండ్లను సమర్పించిన భర్త, ఎంపీ రవిచంద్ర
- కవితను విడుదల చేయాలని రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశాలు
- ఒక్కో కేసులో రూ.10 లక్షల చొప్పున బాండ్ సమర్పించాలన్న సుప్రీంకోర్టు
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విడుదలకు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కవిత పూచీకత్తు బాండ్లను రౌస్ అవెన్యూ కోర్టు అంగీకరించింది. సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో కవితకు భర్త అనిల్ కుమార్, ఎంపీ రవిచంద్ర పూచికత్తు ఇచ్చారు. కాసేపట్లో కవిత తీహార్ జైలు నుంచి బయటికి రానున్నారు. అంతకుముందు సుప్రీంకోర్టు కవితకు బెయిల్ ఇస్తూ తీర్పు చెప్పింది.
బెయిల్ అనంతరం ట్రయల్ ప్రొసీడింగ్స్‌కు క్రమం తప్పకుండా హాజరు కావాలని, త్వరితగతిన విచారణకు సహకరించాలని జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం కవితను ఆదేశించింది.
సీబీఐ, ఈడీ కేసులలో ఒక్కో కేసుకు సంబంధించి రూ.10 లక్షల చొప్పున బాండ్ సమర్పించాలని కవితను సుప్రీంకోర్టు ఆదేశించింది. సాక్ష్యాధారాలను తారుమారు చేయడానికి లేదా సాక్షులను ప్రభావితం చేయడానికి ఎలాంటి ప్రయత్నం చేయకూడదని సూచించింది.