Sajjala Ramakrishna Reddy: హీరోయిన్ పై వేధింపులు... స్పందించిన సజ్జల
- ముంబయి నటిపై వేధింపుల వ్యవహారంలో సజ్జలపై ఆరోపణలు
- సజ్జల ప్రమేయం ఉందంటూ ఓ పత్రికలో కథనం
- న్యాయపరమైన చర్యలు తీసుకుంటానన్న సజ్జల
ముంబయికి చెందిన ఓ హీరోయిన్ పై వేధింపుల వ్యవహారం వైసీపీ అగ్రనేత సజ్జల రామకృష్ణారెడ్డి మెడకు చుట్టుకుంది. హీరోయిన్ పై వేధింపుల వ్యవహారంలో సజ్జల ప్రమేయం కూడా ఉందని, సదరు నటిపై తప్పుడు కేసులు పెట్టేలా పోలీసు అధికారులను ప్రభావితం చేశారన్న ఆరోపణలు వచ్చాయి.
దీనిపై సజ్జల స్పందిస్తూ.. మీడియాలో తనపై వచ్చిన కథనాలను ఖండించారు. మేనిఫెస్టోలో పేర్కొన్న హామీలను అమలు చేయకపోవడం, రాష్ట్రంలో హింసాత్మక ఘటనలు పెరగడం, హత్యలు, ఆస్తుల విధ్వంసం వంటి పరిణామాల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు టీడీపీ నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం, దాని అనుబంధ మీడియా తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు.
'ముంబయి నటిపై వేధింపులు... సజ్జల ప్రమేయం' అంటూ వచ్చిన కథనం పూర్తిగా అవాస్తవం అని సజ్జల పేర్కొన్నారు. కుట్రపూరితంగానే ఈ కథనం వండి వార్చారని అర్థమవుతోందని అన్నారు. తన వ్యక్తిత్వాన్ని, ప్రతిష్ఠను దెబ్బతీసేలా ఆ కథనం ఉందని, న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.
కాగా, పత్రికలో వచ్చిన కథనం ప్రకారం... కృష్ణా జిల్లాకు చెందిన ఓ వైసీపీ నేత, ముంబయికి చెందిన నటి ప్రేమించుకున్నారు. ఆమె పెళ్లి చేసుకోవాలని కోరడంతో సదరు వైసీపీ నేత తిరస్కరించాడు. ఆమెను వదిలించుకునేందుకు సజ్జల సాయం కోరాడు. ఆమెపైనా, ఆమె కుటుంబ సభ్యులపైనా పోలీసులు తప్పుడు కేసులు పెట్టడంలో సజ్జల పాత్ర ఉందన్నది ఆ కథనం సారాంశం.
ఒక పోలీసు అధికారి ముంబయి వెళ్లి ఆ నటిని, ఆమె తల్లిదండ్రులను అరెస్ట్ చేసి విజయవాడకు తీసుకువచ్చారు. వారు బెయిల్ పై విడుదలైన తర్వాత తీవ్ర వేధింపులకు గురయ్యారు. పెళ్లి చేసుకోవాలంటూ మరోసారి వైసీపీ నేతను అడిగినట్టు తెలిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని నటిని, ఆమె కుటుంబ సభ్యులను హెచ్చరించారని ఆ కథనంలో వివరించారు.