KCR Kavitha: బయటకు రాగానే కేసీఆర్ కు కవిత ఫోన్.. ‘నాన్నా’ అంటూ భావోద్వేగం
- కవిత ఆరోగ్యం గురించి ఆరా తీసిన మాజీ ముఖ్యమంత్రి
- మధ్యాహ్నం హైదరాబాద్ కు చేరుకోనున్న కవిత
- నేరుగా ఎర్రవెల్లి ఫాంహౌస్ కు వెళ్లి తండ్రిని కలవనున్న ఎమ్మెల్సీ
ఢిల్లీ లిక్కర్ స్కాంలో సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కె.కవిత జైలు నుంచి విడుదలయ్యారు. తీహార్ జైలు వద్దకు వచ్చిన భర్త, పిల్లలు, ఇతర కుటుంబ సభ్యులను కన్నీళ్లతో పలకరించిన కవిత.. కారెక్కిన తర్వాత తన తండ్రి, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఫోన్ చేశారు. ఐదు నెలల తర్వాత తండ్రి గొంతు వినడంతో ‘నాన్నా..’ అంటూ భావోద్వేగానికి గురయ్యారు. కాసేపటి వరకు దు:ఖం నుంచి తేరుకోలేకపోయారు.
‘బిడ్డా ఎట్లున్నవ్.. పాణం మంచిగున్నదా’ అంటూ కేసీఆర్ అడిగినట్లు సన్నిహితవర్గాలు తెలిపాయి. కూతురును ఓదార్చిన కేసీఆర్.. బాధ పడకు ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో! అంటూ జాగ్రత్తలు చెప్పారట. తండ్రి ఆరోగ్యం గురించి కవిత కూడా ప్రశ్నించినట్లు తెలిసింది. కాగా, మంగళవారం రాత్రి జైలు నుంచి బయటకు అడుగుపెట్టిన కవిత.. రాత్రి ఢిల్లీలోనే ఉన్నారు. బుధవారం మధ్యాహ్నానికి హైదరాబాద్ చేరుకుంటారు. ఆపై నేరుగా ఎర్రవల్లిలోని ఫాంహౌస్ కు వెళ్లి తండ్రి కేసీఆర్ ను కలుసుకుంటారని పార్టీ వర్గాలు తెలిపాయి.