Yogi Sarkar: అలాంటి పోస్టులు పెడితే జీవిత ఖైదు.. యూపీ సర్కార్ హెచ్చరిక
- సోషల్ మీడియాలో అనుచిత పోస్టులపై సీఎం యోగి కన్నెర్ర
- కొత్త పాలసీ తీసుకొచ్చిన ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం
- ఇన్ ఫ్లూయెన్సర్లకు బంపర్ ఆఫర్
చేతిలో స్మార్ట్ ఫోన్ ఉందని సోషల్ మీడియాలో ఇష్టం వచ్చిన పోస్టులు పెడతానంటే ఆనక చింతించాల్సి వస్తుందని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. దేశ వ్యతిరేక పోస్టులు పెడితే జీవిత ఖైదు తప్పదని స్పష్టం చేసింది. ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో పెరిగిపోతున్న అనుచిత పోస్టులపై సీఎం యోగి కన్నెర్ర చేశారు. దీనికి అడ్డుకట్ట వేయడానికి తాజాగా మంగళవారం ఉత్తరప్రదేశ్ డిజిటల్ మీడియా పాలసీ 2024 కు యోగి సర్కారు ఆమోదం తెలిపింది. ఈ కొత్త చట్టం ప్రకారం.. సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెడితే జరిమానా, శిక్ష విధించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. దేశ వ్యతిరేక పోస్టులు పెడితే అరదండాలు తప్పవని, మరీ సీరియస్ పోస్టులు పెట్టిన వారికి జీవిత ఖైదు కూడా విధించే అవకాశం ఉందని హెచ్చరించింది.
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ప్రభుత్వ విధానాల ప్రచారానికి ఈ కొత్త పాలసీ తీసుకొచ్చినట్లు ప్రభుత్వం వెల్లడించింది. అదే సమయంలో అనుచిత పోస్టుల కట్టడికి కూడా ఈ పాలసీ ఉపయోగపడుతుందని పేర్కొంది. పెద్ద సంఖ్యలో ఫాలోవర్లు, సబ్ స్క్రైబర్లు ఉన్న సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్లకు ప్రభుత్వం బంపర్ ఆఫర్ ఇచ్చింది. ప్రభుత్వ పథకాలను రెగ్యులర్ గా తమ తమ ఖాతాల్లో పోస్ట్ చేస్తూ ప్రచారం చేస్తే నెలనెలా రూ.8 లక్షల వరకు అందజేస్తామని తెలిపింది. ఈమేరకు మంగళవారం యూపీ సర్కారు ఓ ప్రెస్ నోట్ విడుదల చేసింది.