Shakib Al Hasan: దోషిగా తేలినప్పుడు చూద్దాం.. బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్ షకీబల్ హసన్‌కు లైన్ క్లియర్
- బంగ్లాదేశ్‌లో ఇటీవల హింసాత్మక ఘటనలు
- అల్లర్లలో మరణించిన యువకుడి తండ్రి నుంచి బీసీబీకి నోటీసులు
- షకీబల్‌పై నిషేధం విధించాలని డిమాండ్
- ప్రస్తుతం అతడిపై నమోదైనది ఎఫ్ఐఆర్ మాత్రమేనని స్పష్టీకరణ
- భారత పర్యటనకు అతడు అందుబాటులో ఉంటాడన్న బోర్డు
బంగ్లాదేశ్‌లో ఇటీవల జరిగిన హింసాత్మక ఘటనల నేపథ్యంలో హత్య కేసు ఎదుర్కొంటున్న బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్ షకీబల్ హసన్ కి బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) నుంచి క్లియరెన్స్ లభించింది. అతడిపై నమోదైనది ఎఫ్ఐఆర్ మాత్రమేనని, దోషిగా తేలి శిక్ష పడితే అప్పుడు చూద్దామని బోర్డు పేర్కొంది. ప్రస్తుతం పాక్‌లో పర్యటిస్తున్న బంగ్లాదేశ్ జట్టులో సభ్యుడిగా ఉన్న షకీబల్‌ను త్వరలో భారత్‌లో పర్యటించనున్న జట్టులోనూ కొనసాగించాలని బీసీబీ నిర్ణయించింది.
ఇటీవల హింసాత్మక ఘటనల్లో ప్రాణాలు కోల్పోయిన రూబెల్ తండ్రి రఫీకుల్ ఇస్లాం లాయర్లు బీసీబీకి నోటీసులు పంపారు. షకీబల్‌పై నిషేధం విధించాలని అందులో డిమాండ్ చేశారు. ఈ నోటీసులపై బీసీబీ స్పందించింది. లీగల్ నోటీసులు అందినమాట వాస్తవమేనని తెలిపింది. ఈ నోటీసుకు తాము సమాధానం ఇచ్చామని, షకీబల్ జట్టులో కొనసాగుతాడని చెప్పినట్టు పేర్కొంది. అతడు దోషిగా తేలేవరకు ఆడేందుకు ఎలాంటి ఇబ్బంది లేదని వివరించింది. అతడికి న్యాయపరమైన సాయం అందించేందుకు బోర్డు సిద్ధంగా ఉందని తెలిపింది. సర్రే కౌంటీ క్రికెట్ ఆడేందుకు కూడా అతడికి ఎన్వోసీ ఇచ్చినట్టు పేర్కొంది.