Janasena: అల్లు అర్జున్ పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన జనసేన నేత చలమలశెట్టి రమేశ్ బాబు
- 'నీవు హీరో ననుకుంటున్నావా .. నువ్వొక కమేడియన్‌వి' అంటూ రమేశ్ బాబు విమర్శలు
- చిరు బ్రదర్స్ ను విమర్శించే స్థాయి అర్జున్ కు లేదని వ్యాఖ్య
- గన్నవరం నియోజకవర్గంలో అల్లు అర్జున్ సినిమా ఎలా అడుతుందో చూస్తానని రమేశ్ హెచ్చరిక
పవన్ కల్యాణ్, అల్లు అర్జున్ ఫ్యాన్స్ మధ్య గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా వేదికగా వార్ నడుస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో మెగా ఫ్యామిలీ మొత్తం పవన్ కల్యాణ్ గెలుపునకు పిఠాపురంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనగా, అల్లు అర్జున్ నంద్యాలలో తన మిత్రుడు, వైసీపీ అభ్యర్ధి శిల్పా రవి గెలుపునకు ప్రచారం చేశారు. అప్పటి నుండి అల్లు అర్జున్ ను మెగా ఫ్యాన్స్ టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. ఇదే క్రమంలో మెగా ఫ్యామిలీని కించపరిచేలా అల్లు అర్జున్ పేరుతో సోషల్ మీడియాలో ఓ ట్వీట్ వైరల్ కావడంతో మెగా ఫ్యాన్స్ రగిలిపోయారు.
జనసేన నేతలు మీడియా ముందుకు వచ్చి మరీ అల్లు అర్జున్ పై తీవ్ర స్థాయిలో కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త చలమలశెట్టి రమేశ్ బాబు అల్లు అర్జున్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బాపులపాడు మండలం హనుమాన్ జంక్షన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చలమలశెట్టి రమేశ్ బాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. 'అల్లు అర్జున్ .. నీవు హీరో ననుకుంటున్నావా.. కమేడియన్ వి మాత్రమే. చిరంజీవి, పవన్ కల్యాణ్, నాగబాబు అండ చూసుకుని సినిమాల్లోకి వచ్చావు. వారిని విమర్శించే స్థాయి నీకు లేదు' అంటూ రమేశ్ మండిపడ్డారు.
సినీ ఇండస్ట్రీలో చిరంజీవి మహావృక్షం లాంటి వాడని అన్నారు. బ్లడ్ బ్యాంక్ నిర్వహణ సహా అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఎంతో మందికి జీవితాన్ని ప్రసాదించిన మహనీయుడు చిరంజీవి అని అన్నారు. నువ్వు (అర్జున్) నీడను ఇచ్చిన చెట్టునే విమర్శిస్తున్నావంటూ దుయ్యబట్టారు. 'నీ బాబు అల్లు అరవింద్, నువ్వు పిల్లికి కూడా బిచ్చం పెట్టలేనటువంటి వాళ్లు' అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మీ స్థాయి ఏమిటో.. నువ్వేమిటో ముందు చూసుకో అని హితవు పలికారు. నువ్వు తొందరలో చిరంజీవి, పవన్ కల్యాణ్, నాగబాబు కాళ్లు కడిగి నీళ్లు నెత్తిన చల్లుకుంటే కానీ నువ్వు చేసిన తప్పు సరికాదని అన్నారు. డిసెంబర్ నెలలో విడుదల అవుతున్న నీ సినిమా మా నియోజకవర్గంలో ఎలా అడుతుందో చూపిస్తానని శపథం చేశారు. ఇక్కడ నీ ఫ్లెక్సీలు కట్టే వాళ్లు కూడా ఎవరూ లేరని రమేశ్ బాబు అన్నారు.