UPSC: యూపీఎస్సీకి ఆధార్ వెరిఫికేషన్ అనుమతి

UPSC to perform Aadhaar based authentication to verify candidates
  • అభ్యర్థుల ధ్రువీకరణ కోసం ఆధార్‌ను పరిశీలించనున్న యూపీఎస్సీ
  • తొలిసారి అనుమతి జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం
  • పూజా ఖేద్కర్ వ్యవహారం నేపథ్యంలో అనుమతి  
మోసపూరిత విధానంలో ఎంపికయ్యారని తేలడంతో పూజా ఖేద్కర్ అనే ట్రైనీ ఐఏఎస్ అధికారిణిని ఇటీవలే యూపీఎస్సీ డిబార్ చేసింది. అయితే ఈ వ్యవహారంతో అభ్యర్థుల గుర్తింపు విషయంలో మరింత పకడ్బందీగా వ్యవహరించాల్సిన ఆవశ్యకత ఉందని స్పష్టమైంది. దీంతో ఈ సమస్యకు చెక్ పెట్టడమే లక్ష్యంగా యూపీఎస్సీకి కేంద్ర ప్రభుత్వం ఆధార్ వెరిఫికేషన్‌కు అనుమతి నిచ్చింది. ఈ విధంగా అనుమతి ఇవ్వడం ఇదే తొలిసారి. దీంతో అభ్యర్థులకు సంబంధించిన వివరాల నమోదుతో పాటు పరీక్ష వివిధ దశలు, రిక్రూట్‌మెంట్ సమయంలో కూడా అభ్యర్థుల గుర్తింపునకు ఆధార్ ఆధారిత వెరిఫికేషన్‌ను యూపీఎస్సీ ఉపయోగించనుంది.

ఈ మేరకు సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖ బుధవారం ఒక నోటిఫికేషన్‌ విడుదల చేసింది. వివిధ దశల పరీక్ష‌తో పాటు రిజిస్ట్రేషన్ సమయంలో అభ్యర్థుల గుర్తింపును ధ్రువీకరించేందుకు స్వచ్ఛంద ప్రాతిపదికన 'వన్ టైమ్ రిజిస్ట్రేషన్' పోర్టల్‌పై యూపీఎస్సీ ఆధార్ వెరిఫికేషన్‌ను చేయనుందని తెలిపింది. ఈ మేరకు అనుమతి ఇచ్చామని వివరించింది. యూఐడీఏఐ జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా యూపీఎస్సీ ఆధార్ పరిశీలన చేయాల్సి ఉంటుందని పేర్కొంది.

అర్హత విషయంలో మోసానికి పాల్పడ్డారనే కారణంతో గత నెలలో ప్రొబేషనరీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేద్కర్‌ను యూపీఎస్సీ డీబార్ చేసింది. అంగ వైకల్యం సర్టిఫికేట్‌తో పాటు ఓబీసీ (నాన్-క్రీమీ లేయర్) కోటా విషయంలోనూ పూజా ఖేద్కర్ దుర్వినియోగానికి పాల్పడ్డారనే ఆరోపణలు వచ్చాయి. వీటిని సమగ్రంగా పరిశీలించిన అనంతరం యూపీఎస్సీ ఈ నిర్ణయం తీసుకుంది. భవిష్యత్తులో అన్ని పరీక్షల నుంచి ఆమెను డిబార్ చేస్తున్నట్టు స్పష్టం చేసింది. కాగా ప్రతి ఏడాది లక్షలాది మంది యూపీఎస్సీ సివిల్స్ పరీక్షలు రాస్తున్న విషయం తెలిసిందే.
UPSC
Aadhaar
Aadhaar Verification
Central Government

More Telugu News