Mopidevi Venkataramana: వైసీపీకి, రాజ్యసభ సభ్యత్వానికి మోపిదేవి, బీద మస్తాన్ రావు రాజీనామా
- ఏక కాలంలో ఎంపీ పదవికి, వైసీపీ పార్టీకి రాజీనామా
- మరో ఎంపీ బీద మస్తాన్ రావుతో కలిసి రాజ్యసభ చైర్మన్ కు లేఖ అందజేత
- టీడీపీలో చేరబోతున్నట్లు వెల్లడించిన మోపిదేవి
వైసీపీ సీనియర్ నేత, ఏపీ మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా ఆయన రిజైన్ చేశారు. ఆయనతో పాటు మరో ఎంపీ బీద మస్తాన్ రావు కూడా రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈమేరకు వీరిద్దరూ ఈ రోజు రాజ్యసభ చైర్మన్ ను కలిసి, రాజీనామా లేఖలను అందజేశారు. అనంతరం వైసీపీకి గుడ్ బై చెబుతున్నట్లు మోపిదేవి వెంకటరమణ ప్రకటించారు. తన రాజీనామాకు చాలా కారణాలు ఉన్నాయన్న మోపిదేవి వెంకటరమణ.. చాలా రోజుల పాటు ఆలోచించాకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
గెలుపైనా ఓటమైనా స్థానిక రాజకీయాల్లో ఉండడమే తనకు ఇష్టమని చెప్పుకొచ్చారు. రాజ్యసభకు రావడం తనకు ఇష్టంలేదన్నారు. త్వరలో తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. టీడీపీలో తనకు ఎలాంటి బాధ్యతలు అప్పగిస్తారనేది త్వరలోనే తెలుస్తుందని చెప్పారు. తాను పదవుల కోసం పార్టీ మారలేదని ఈ సందర్భంగా మోపిదేవి స్పష్టం చేశారు.
వ్యక్తిగత కారణాలే.. బీద మస్తాన్ రావు
మోపిదేవి వెంకటరమణతో కలిసి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన బీద మస్తాన్ రావు స్పందిస్తూ.. వ్యక్తిగత కారణాల వల్ల పార్టీకి, పదవికి రాజీనామా చేసినట్లు చెప్పుకొచ్చారు. భవిష్యత్ కార్యాచరణపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. ఏ పార్టీలో చేరాలనేదానిపై తన అభిమానులు, కార్యకర్తలతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని వివరించారు. ఇప్పటి వరకు సహకరించిన వైసీపీ అధినేత జగన్ కు, పార్టీ కార్యకర్తలకు ఈ సందర్భంగా బీద మస్తాన్ రావు కృతజ్ఞలు తెలిపారు.