Congress: కోల్‌కతా హత్యాచార ఘటన... మమతా బెనర్జీపై కాంగ్రెస్ నేత తీవ్ర విమర్శలు
- దర్యాఫ్తు సజావుగా సాగాలని మమత కోరుకోవడం లేదని విమర్శ
- కేసు దర్యాప్తు సాగితే ఎన్నో రహస్యాలు బయటకు వస్తాయని వ్యాఖ్య
- అలా జరగడం మమతకు ఇష్టం లేదని ఆరోపణ
కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో జరిగిన హత్యాచార కేసులో దర్యాఫ్తు సజావుగా సాగాలని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోరుకోవడం లేదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అధిర్ రంజన్ చౌదరి సంచలన ఆరోపణలు చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఈ కేసు దర్యాఫ్తు సరైన విధంగా సాగితే ఎన్నో రహస్యాలు బయటకు వస్తాయన్నారు. కానీ ఇలా జరగడం మమతకు ఇష్టం లేదని ఆరోపించారు.
ఈ ఘటన నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు ఆమె ఇష్టారీతిన మాట్లాడుతున్నారని విమర్శించారు. కానీ ప్రజలు భయపడరని, ఈ ఘటన ఇప్పుడు ప్రజా ఉద్యమంగా మారిందన్నారు.
బెంగాల్‌లో బీజేపీ అరాచకం సృష్టిస్తోందని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ఆరోపించారు. శాంతియుత వాతావరణాన్ని భగ్నం చేయాలని బీజేపీ కోరుకుంటోందని ధ్వజమెత్తారు. ప్రజలను నిరంతరం రెచ్చగొడుతూ అలజడులకు ప్రేరేపిస్తున్నారని మండిపడ్డారు. కాషాయ పాలకుల ఉచ్చులో బెంగాల్ ప్రజలు చిక్కుకోరని తాము భావిస్తున్నామన్నారు.
లైంగిక దాడుల విషయానికి వస్తే ఉత్తర ప్రదేశ్ సహా బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే ఈ ఘటనలు అధికంగా వెలుగు చూస్తున్నాయన్నారు. బీహార్‌లోనూ లైంగిక దాడుల ఘటనలు తరుచూ చోటు చేసుకుంటున్నాయన్నారు. వీటిపై అధికార పార్టీ ఎందుకు మౌనంగా ఉంటోందని ప్రశ్నించారు. బీజేపీ ప్రతిచోటా భయానక వాతావరణం సృష్టించాలని భావిస్తోందని కానీ అవేవీ ఫలప్రదం కాలేదన్నారు.