Chandrababu: జీతం కోసం ఇంగ్లిష్ నేర్పిస్తాం.. జీవితం కోసం తెలుగును ముందుకు తీసుకెళ్తాం: సీఎం చంద్రబాబు

It is a mistake to think that if you learn English will get jobs says CM Chandrababu

  • వైఎస్ జగన్ ప్రభుత్వం ఇంగ్లిష్ భాషే జీవితం అన్న విధంగా వ్యవహరించిందని విమర్శ 
  • తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన తెలుగు భాషా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న సీఎం
  • వేడుకలకు హాజరైన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి కందుల దుర్గేశ్

విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో తెలుగు భాషా దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌‌తో పాటు మంత్రి కందుల దుర్గేశ్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలుగు భాష గొప్పదనంపై చంద్రబాబు మాట్లాడారు. జీతం కోసం ఇంగ్లిష్ నేర్పిస్తామని, జీవితం కోసం తెలుగును ముందుకు తీసుకెళ్తామని ఆయన వ్యాఖ్యానించారు. ఇంగ్లిష్ వస్తే ఉద్యోగాలు వస్తాయని భావించడం పొరపాటు అవుతుందని అభిప్రాయపడ్డారు. వైఎస్ జగన్ ప్రభుత్వం ఇంగ్లిషే జీవితం అన్న విధంగా నడుచుకుందని, భాష అనేది కమ్యూనికేషన్ కోసం మాత్రమేనని, మాతృభాషలోనే  జ్ఞానం పెరుగుతుందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. మన మాతృ భాష అయిన తెలుగును ఎట్టి పరిస్థితుల్లో పరిరక్షిస్తామని ఆయన వాగ్దానం చేశారు.

అమెరికా లాంటి దేశంలో తెలుగు 11వ భాషగా ఉందని చంద్రబాబు ప్రస్తావించారు. ఇక్కడ ఉన్నవారు కూచిపూడి నాట్యాన్ని మరిచారని, అయితే అమెరికాలో ఉన్నవారు మాత్రం మరిచిపోలేదని అన్నారు. కూచిపూడి నృత్యానికి దేశవ్యాప్తంగా ఆదరణ ఉండేలా తీర్చిదిద్దామని, భాషను మరచిపోతే జాతి కనుమరుగైపోతుందని చంద్రబాబు పేర్కొన్నారు.

తెలుగు భాషను గౌరవించుకునేందుకు ప్రతి ఏడాది గిడుగు రామ్మూర్తి జయంతి ఉత్సవాలు నిర్వహించుకుంటున్నామని చంద్రబాబు ప్రస్తావించారు. భాష లేకపోతే మన మనుగడే ఉండదని, తెలుగు సంస్కృతికి, సాంప్రదాయాలకు మూలం భాష అని అన్నారు. తెలుగు భాష విధ్వంసం కాకుండా అందరూ కృషి చేయాలని సూచించారు. ఇక పొట్టి శ్రీరాములు భాషా ప్రయుక్త రాష్ట్రాల కోసం పోరాటం చేశారని, ఎన్టీ రామారావు తెలుగువారి ఆత్మగౌరాన్ని దేశం నలుమూలల చాటి చెప్పారని చంద్రబాబు కొనియాడారు.

  • Loading...

More Telugu News