Bandi Sanjay: కవిత బెయిల్‌పై చేసిన వ్యాఖ్యల మీద బండి సంజయ్ వివరణ
- తాను కవిత అడ్వొకేట్ గురించి మాత్రమే మాట్లాడానన్న బండి సంజయ్
- రాజ్యసభ అభ్యర్థి కోసం బీఆర్ఎస్ మద్దతిచ్చిందని ఆరోపణ
- కోర్టు తీర్పులపై జాగ్రత్తగా మాట్లాడాలని సుప్రీంకోర్టు చెప్పిందన్న బీజేపీ నేత
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ విషయమై తాను చేసిన వ్యాఖ్యలపై కేంద్రమంత్రి బండి సంజయ్ వివరణ ఇచ్చారు. తాను కవితకు బెయిల్ ఇచ్చిన అంశంపై మాట్లాడలేదన్నారు. కానీ కవిత అడ్వొకేట్ గురించి మాత్రమే మాట్లాడానన్నారు. రాజ్యసభ అభ్యర్థి గెలుపు కోసం బీఆర్ఎస్ మద్దతు ఇచ్చిందని ఆరోపించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒక్కటేనని, ఆ విషయమే తాను చెప్పానన్నారు. కోర్టు తీర్పులపై జాగ్రత్తగా మాట్లాడాలని సుప్రీంకోర్టు చెప్పిందన్నారు. కేటీఆర్ అమెరికాకు వెళ్లాడని, రేపో మాపో సింగపూర్ మీదుగా కాంగ్రెస్ నేతలు కూడా వెళ్తారని ఎద్దేవా చేశారు.
హైడ్రా పనితీరుపై బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అన్ని భూఆక్రమణలపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎన్ కన్వెన్షన్‌ను మాత్రమే కూల్చి మిగతా వాటిని వదిలేయడం ఏమిటన్నారు. కూల్చివేతల విషయంలో పెద్దోడిని... పేదోడిని ఒకేలా చూడవద్దన్నారు. పేద ప్రజల పట్ల ప్రభుత్వం సానుకూలంగా ఉండాలన్నారు. జన్వాడ ఫామ్ హౌస్‌ను ఎందుకు కూల్చడం లేదని ప్రశ్నించారు. ఒవైసీ కబ్జాపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.
ఒవైసీ కాలేజీ విద్యార్థులను మరో కాలేజీకి సర్దుబాటు చేయాలని సూచించారు. తమ కాలేజీపై చెయ్యి వేస్తే సంగతి చెబుతానని ఒవైసీ హెచ్చరించారని, ఆ మాటలకు రేవంత్ రెడ్డి భయపడ్డారా? అని ప్రశ్నించారు. మిగతా కాలేజీలకు నోటీసులు ఇచ్చి... ఒవైసీ కాలేజీకి ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు.