Juvvaladinne Fishing Harbour: జువ్వలదిన్నె హార్బర్ నేడే ప్రారంభం.. నెల్లూరు జిల్లాలో అతిపెద్ద ఫిషింగ్ హార్బర్

PM Modi to open Juvvaladinne fishing harbour today
  • నెల్లూరు జిల్లా బోగోలు మండలం జువ్వలదిన్నె వద్ద ఫిషింగ్ హార్బర్
  • గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు హార్బర్ కు శంకుస్థాపన
  • ఈరోజు 218 ఫిషరీస్ ప్రాజెక్టులను ప్రారంభించనున్న మోదీ
నెల్లూరు జిల్లా మత్స్యకారులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న శుభ ఘడియలు వచ్చాయి. బోగోలు మండలం జువ్వలదిన్నె వద్ద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్మించిన ఫిషింగ్ హార్బర్ ఈరోజు ప్రారంభం కానుంది. ఈ హార్బర్ ను ప్రధాని మోదీ వర్చువల్ గా ప్రారంభించనున్నారు. మహారాష్ట్రలోని వాద్వాన్ పోర్టును కూడా ఈరోజు మోదీ ప్రారంభించనున్నారు. ఈ రోజు దేశ వ్యాప్తంగా 218 ఫిషరీస్ ప్రాజెక్టులను ప్రధాని ప్రారంభిస్తారు. 

నెల్లూరు కలెక్టరేట్ లోని తిక్కన ప్రాంగణంలో జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ ప్రారంభోత్సవ కార్యక్రమం జరగనుంది. మధ్యాహ్నం ఒంటి గంటకు వర్చువల్ గా శిలాఫలకాన్ని మోదీ ఆవిష్కరిస్తారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో జువ్వలదిన్నె హార్బర్ పురుడు పోసుకుంది. రూ. 288 కోట్ల ఖర్చు అంచనాతో ప్రాజెక్టును రూపొందించారు. అప్పటి రాష్ట్ర ప్రభుత్వం స్థల సేకరణ చేసి కేంద్ర ప్రభుత్వానికి అందించింది. ఆనాటి సీఎం చంద్రబాబు హార్బర్ కు శంకుస్థాపన చేశారు. 

ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం రావడంతో పనులు మందగించాయి. బిల్లులు రాకపోవడంతో కాంట్రాక్టర్లు పనులు ఆపేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత... కొత్త కాంట్రాక్టర్ తో పనులు పూర్తి చేయించారు. ఈరోజు హార్బర్ ప్రారంభం కాబోతోంది. నెల్లూరు జిల్లాలో ఇదే అతి పెద్ద ఫిషింగ్ హార్బర్ కావడం గమనార్హం. హార్బర్ ప్రారంభం అవుతున్న తరుణంలో మత్స్యకారులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.
Juvvaladinne Fishing Harbour
Nellore District
Narendra Modi
BJP
Chandrababu
Telugudesam

More Telugu News