Pawan Kalyan: దేశవాళీ జాతుల మొక్కలే పర్యావరణానికి నేస్తాలు: పవన్ కల్యాణ్
- వన మహోత్సవంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని పిలుపునిచ్చిన పవన్ కల్యాణ్
- స్థానిక వృక్ష జాతుల మొక్కలనే నాటాలని పవన్ సూచన
- కోనోకార్పస్ జాతి మొక్కలతో దుష్ప్రభావం ఉందని అరబ్ దేశాలే వద్దనుకున్నాయని చెప్పిన పవన్ కల్యాణ్
దేశవాళీ జాతుల మొక్కలే పర్యావరణానికి నేస్తాలు అని ఏపీ డిప్యూటి సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో చేపడుతున్న వన మహోత్సవంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు ఈరోజు పవన్ కల్యాణ్ వీడియో సందేశం ఇచ్చారు. పచ్చదనంతో రాష్ట్రమంతా కళకళలాడాలని, అదే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుందని చెప్పారు. 29 శాతం ఉన్న పచ్చదనాన్ని 50 శాతం చేర్చేలా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు. విరివిగా ప్రతి ఒక్కరూ మొక్కలను నాటడం, వాటి సంరక్షణ బాధ్యతను తీసుకోవడం ద్వారా రాష్ట్రంలో 50 శాతానికి పచ్చదనం పెరగాలని కూటమి ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుందని తెలిపారు.
మొక్కల జాతుల ఎంపిక కీలకం
వన మహోత్సవం కార్యక్రమంలో నాట బోయే మొక్కల జాతుల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోవాలని పవన్ కల్యాణ్ సూచించారు. దేశీయ జాతులను ఎంపిక చేసుకోవాలని తెలిపారు. స్థానిక వృక్ష జాతులకు చెందిన మొక్కలు నాటడం ద్వారా జీవ వైవిధ్యాన్ని, నేల ఆరోగ్యాన్ని సంపూర్ణంగా కాపాడవచ్చని అన్నారు. పర్యావరణ సమతుల్యత, మానవ ఆరోగ్యాన్ని కాపాడిన వాళ్లం అవుతామని చెప్పారు. మన దేశ భౌగోళిక పరిస్థితులకు విరుద్ధంగా ఉండే అన్య జాతుల మొక్కలు నాటడం వల్ల పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుందని తెలిపారు. వేగంగా పెరుగుతాయని, ఎవెన్యూ ప్లాంటేషన్ అని, నిర్వహణ ఖర్చులు తక్కువ అనే కోణంలో గత దశాబ్ద కాలంగా కోనో కార్పస్, ఏడు ఆకుల పాల, మడగాస్కర్ ఆల్మన్, ఆస్ట్రేలియా తుమ్మ వంటి అన్యజాతుల మొక్కలను నాటారనీ అయితే వీటి వల్ల పర్యావరణానికి మేలు కంటే కూడా కీడు అధికంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారన్నారు.
అన్య జాతుల మొక్కలు- భూగర్భ జలసంపద మీద ప్రభావం చూపడంతోపాటు మనిషికి ఆరోగ్యపరంగానూ ఇబ్బందులు తెస్తాయని చెప్పారు. అరబ్ దేశాల్లో పచ్చదనం కోసం కోనోకార్పస్ జాతి మొక్కలను విరివిగా పెంచారని, అయితే తర్వాత వాటి దుష్ప్రభావం అర్థం చేసుకొని అరబ్ దేశాలే ఈ మొక్కను వద్దనుకొని నిషేధించాయని గుర్తు చేశారు. దేశంలోనూ తెలంగాణ, కర్ణాటక, గుజరాత్, అస్సాం ప్రభుత్వాలు సైతం కోనోకార్పస్ను నిషేధించాయన్నారు. కార్తీకమాసం వనసమారాధన వరకు జరిగే ఈ వన మహోత్సవం వేళ దేశీయ జాతుల మొక్కలను, అందరికీ మేలు చేసే మొక్కలను విరివిగా పెంచుదామని పిలుపు నిచ్చారు. కానుగ, వేప, రావి, చింత, ఉసిరి, శ్రీగంధం, మర్రి, అశోక, రేలా, దిరిసెం మారేడు, నేరేడు, దేవకాంచన, తెల్లమద్ది, మామిడి, కదంబం, జమ్మి, సీత అశోక, వెలగ, సీతాఫల వంటి ఎన్నో మనకు ఉపయోగపడే మన జాతుల మొక్కలను పెంచుదామన్నారు.