Chandrababu: బాలకృష్ణ 50 ఏళ్ల నట ప్రస్థానంపై సీఎం చంద్రబాబు స్పందన
- 'తాతమ్మ కల' చిత్రంతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన బాలకృష్ణ
- 1974 ఆగస్టు 30న రిలీజైన 'తాతమ్మ కల' చిత్రం
- గోల్డెన్ జూబ్లీ జరుపుకుంటున్న బాలయ్య
- శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు
వయసుతో సంబంధం లేకుండా, అభిమానుల్లో ఇప్పటికీ క్రేజ్ నిలుపుకుంటూ, బ్లాక్ బస్టర్ సినిమాలతో దూసుకుపోతున్న నందమూరి బాలకృష్ణ కెరీర్ పరంగా గోల్డెన్ జూబ్లీ జరుపుకుంటున్నారు. ఐదు దశాబ్దాల కిందట బాలకృష్ణ మొదటి చిత్రం 'తాతమ్మ కల' ఇదే రోజున (ఆగస్టు 30) రిలీజైంది.
ఈ నేపథ్యంలో, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. ఆంధ్రుల అభిమాన కథానాయకుడు నందమూరి బాలకృష్ణ తన 50 ఏళ్ల నట ప్రస్థానాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా శుభాకాంక్షలు, అభినందనలు తెలుపుకుంటున్నానని వెల్లడించారు.
50 ఏళ్ల క్రితం ఇదే రోజున విడుదలైన 'తాతమ్మ కల' చిత్రంతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన బాలయ్య ఇప్పటికీ అగ్రహీరోగా రాణిస్తున్నారని కితాబిచ్చారు. నేటి తరాన్ని కూడా అలరించే చిత్రాలతో బాక్సాఫీసు రికార్డులు బద్దలు కొడుతున్నారని కొనియాడారు. తండ్రి ఎన్టీఆర్ పోషించిన పౌరాణిక పాత్రలతో పాటు అన్ని జానర్లలో నటించి తానేంటో చాటిచెప్పారంటూ బాలకృష్ణ ఘనతలను చంద్రబాబు ప్రస్తావించారు.
కథానాయకుడిగానే కాకుండా ప్రజా నాయకుడిగా కూడా రాణిస్తున్న బాలకృష్ణ మరిన్ని రికార్డులను సృష్టించాలని, మరెన్నో మైలురాళ్లను అధిగమించి అన్ స్టాపబుల్ గా ముందుకు సాగాలని కోరుకుంటున్నానని ఆకాంక్షించారు.