Etela Rajender: సమయం వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి తప్పుల చిట్టాను విప్పుతా: ఈటల రాజేందర్

Etala Rajendar says will reveal revanth reddy wrong doings when needed

  • కాంగ్రెస్ తొమ్మిది నెలల్లోనే ప్రజలతో ఛీ కొట్టించుకుంటోందన్న ఈటల
  • కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ప్రజల విశ్వాసాన్ని కోల్పోయాయని వ్యాఖ్య
  • సోషల్ మీడియాలో ఉన్నవారికి ఎన్ కన్వెన్షన్ మాత్రమే తెలుసున్న ఈటల
  • చెరువుల కింద వందలాది ఇళ్లను ప్రభుత్వం కూల్చేయాలని చూస్తోందని మండిపాటు

సమయం వచ్చినప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తప్పుల చిట్టాను విప్పుతానని మల్కాజ్‌గిరి ఎంపీ, బీజేపీ నేత ఈటల రాజేందర్ అన్నారు. ముఖ్యమంత్రి తప్పుల చిట్టాను తాను రాస్తున్నానన్నారు. 

హైదరాబాద్‌లో నిర్వహించిన బీజేపీ వర్క్ షాప్‌లో ఆయన మాట్లాడుతూ... కేసీఆర్ ఛీ అనిపించుకోవడానికి ఆరేళ్ళు పట్టిందని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం తొమ్మిది నెలల్లోనే ప్రజలతో ఛీ కొట్టించుకుంటోందన్నారు. తెలంగాణ వచ్చాక అధికారంలోకి వచ్చిన రెండు పార్టీలూ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయాయన్నారు. రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి అయినట్టుటుగా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని విమర్శించారు.

హైడ్రా పేరుతో ప్రభుత్వం హంగామా సృష్టిస్తోందన్నారు. సోషల్ మీడియాలో ఉన్న వారికి కేవలం ఎన్ కన్వెన్షన్‌ను కూల్చిన విషయమే తెలుసని, కానీ చెరువుల కింద వందలాది పేద కుటుంబాల ఇళ్లను కూడా ఈ ప్రభుత్వం కూల్చేసే ప్రయత్నం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. హస్మత్‌‍పేట చెరువు కింద 120 మంది పేదలకు నోటీసులు ఇచ్చారన్నారు. పేదల ఇళ్ల జోలికి వస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. సీఎం ప్రజాక్షేత్రంలో తేలిపోవడం ఖాయమన్నారు.

లోక్ సభలో బీజేపీకి ఇద్దరే ఎంపీలు ఉన్నప్పుడు ఒకటి గుజరాత్‌లో, రెండోది తెలంగాణలో గెలిచామన్నారు. గుజరాత్‌లో ఎప్పుడో అధికారంలోకి వచ్చిన పార్టీ... తెలంగాణలో ఇప్పటి వరకు ఎందుకు అధికారంలోకి రాలేకపోతున్నట్టు అని బీజేపీ శ్రేణులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఒక లోక్ సభ సీటును గెలిచిన 46 ఏళ్ల తర్వాత... ఇప్పుడు ఎనిమిది లోక్ సభ సీట్లు గెలిచామన్నారు. 

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ ఓట్ షేర్‌లో తేడా కేవలం నాలుగు శాతం అన్నారు. ఎంపీ ఎన్నికల్లో ఎలాగైతే పార్టీ కోసం కష్టపడ్డారో స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ అలాగే కష్టపడి పని చేయాలని బీజేపీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

  • Loading...

More Telugu News