Sunitha William: నాసా మదిలో కల్పనా చావ్లా విషాద ఘటన.. అందుకే సునీతా విలియమ్స్ విషయంలో జాగ్రత్తలు!
- గత ప్రమాద ఘటనలను దృష్టిలో ఉంచుకొనే వ్యోమగాములు సునీతా విలియమ్స్, విల్మోర్‌ల ప్రయాణాన్ని వాయిదా వేసినట్టు వెల్లడి
- నాడు జూనియర్ ఫ్లైట్ సైంటిస్టులు హెచ్చరించినా పట్టించుకోలేదని గుర్తుచేసుకున్న నాసా చీఫ్ బిల్ నెల్సన్
- 2003, 1986లో జరిగిన అంతరిక్ష నౌకల ప్రమాదాలను పరిగణనలోకి తీసుకొని తాజా నిర్ణయం తీసుకున్నట్టు వివరణ
- వచ్చే ఏడాది ఫిబ్రవరిలో అంతరిక్షం నుంచి భూమికి బయలుదేరనున్న సునీతా విలియమ్స్
భారత సంతతకి చెందిన నాసా వ్యోమగామి కల్పనా చావ్లా ఫిబ్రవరి 1, 2003న విషాదకర రీతిలో కన్నుమూసిన విషయం తెలిసిందే. అంతరిక్ష నౌక ‘కొలంబియా’ భూవాతావరణంలోకి ప్రవేశిస్తున్న సమయంలో నౌక ముక్కలుగా విడిపోయి పేలిపోవడంతో ఆమె ప్రాణాలు కోల్పోయారు. మొత్తం ఆరుగురు వ్యోమగాములు కన్నుమూసిన ఈ ఘటన నాసా శాస్త్రవేత్తల మనసులో బలంగా నాటుకుపోయిందని, అందుకే ప్రస్తుతం అంతరిక్షంలో ఉన్న వ్యోమగామి సునీతా విలియమ్స్ విషయంలో శాస్త్రవేత్తలు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారని, భద్రత దృష్ట్యా ఆమెను 8 నెలల పాటు అంతరిక్షంలోనే ఉంచాలని నిర్ణయించినట్టు నాసా చీఫ్ బిల్ నెల్సన్ వెల్లడించారు.
కొలంబియా నౌక దుర్ఘటనకు ముందు జనవరి 28, 1986న ‘ఛాలెంజర్’ అనే అంతరిక్ష నౌక పేలిపోయి అందులో ఉన్న అందరూ చనిపోయారు. ఈ రెండు ప్రమాదాలు నాసా తాజా నిర్ణయాన్ని చాలా ప్రభావితం చేశాయని బిల్ నెల్సన్ వివరించారు. ఈ రెండు రెండు అంతరిక్ష నౌకల ప్రమాదాల సమయంలో సంబంధిత పరిశోధనల్లో నెల్సన్ భాగస్వామిగా ఉన్నారు.
అప్పట్లో స్పష్టమైన తప్పులు దొర్లాయని ఆయన వెల్లడించారు. జూనియర్ ఫ్లైట్ ఇంజనీర్లు ప్రమాదాలపై హెచ్చరించినప్పటికీ ఎవరూ పట్టించుకోలేదని, నాసాలో అప్పుడు ఇలాంటి సంస్కృతి ఉండేదని నెల్సన్ వెల్లడించారు. కానీ ప్రస్తుతం అందరూ తమ అభిప్రాయాలను వెలిబుచ్చేందుకు ప్రోత్సహించే వాతావరణం ఉందని ఆయన వివరించారు. అందుకే వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్‌లను 2025 ఫిబ్రవరిలో భూమికి తీసుకురావాలని నాసా నిర్ణయించిందని ఆయన వివరించారు. ప్రస్తుతం నౌక పరిస్థితి దృష్ట్యా ఇప్పుడు తీసుకొస్తే కలిగే నష్టాల గురించి అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్టు వివరించారు. ఏకగ్రీవంగా వాయిదా నిర్ణయానికి వచ్చామని నెల్సన్ వివరించారు. అంతరిక్షయానం ఇప్పుడు సురక్షితమైనదే అయినప్పటికీ, ప్రమాదాలు కూడా పొంచివుంటాయని అన్నారు.
16 నిమిషాలు ముందుగా వచ్చిన కొలంబియా నౌక
కాగా, ఇక 16 నిమిషాలలో ల్యాండ్ అవుతుందనగా, కల్పనా చావ్లా ప్రయాణిస్తున్న కొలంబియా అంతరిక్ష నౌక భూవాతావరణంలోకి ప్రవేశించగానే ప్రమాదానికి గురైంది. దీంతో కొలంబియా నౌక రెండుగా విడిపోయింది. దక్షిణ అమెరికాలో ఆకాశంలో కల్పనా చావ్లా మరణించారు. ఆమె భారత్‌కు చెందిన వ్యక్తి. 1976లో హర్యానాలోని కర్నాల్‌లో పాఠశాల విద్యాభ్యాసం చేశారు. 1982లో పంజాబ్ ఇంజినీరింగ్ కాలేజీలో ఏరోనాటికల్ ఇంజనీరింగ్‌లో బీఎస్సీ చేశారు. ఉన్నత విద్యను అమెరికాలో పూర్తి చేశారు. 1994లో నాసాలో వ్యోమగామిగా చేరారు.