Heavy Rain: విజయవాడలో కుండపోత వాన
- బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం
- ఎడతెరిపిలేని వర్షంతో విజయవాడ జలమయం
- రోడ్లపై మోకాలి లోతున నీరు
- ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం... వాహనదారుల అవస్తలు
బంగాళాఖాతంలో ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాలను ఆనుకుని తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఏపీలో గత రాత్రి నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ విజయవాడలో కుండపోత వాన కురిసింది.
విద్యాధరపురం, ఆర్ఆర్ నగర్, విజయవాడ సెంట్రల్ బస్ స్టాండ్, బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ ప్రాంతాల్లో రహదారులు జలమయం అయ్యాయి. రోడ్లపైకి భారీగా నీరు చేరడంతో ట్రాఫిక్ కు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. వాహనదారులు అవస్తలు పడుతున్నారు.
రామవరప్పాడు రింగ్ రోడ్ నుంచి నిడమానూరు వరకు వాహనాలు నిలిచిపోయాయి. చాలా చోట్ల రోడ్లపై మోకాలి లోతు నీరు నిలిచింది. ఆర్టీసీ బస్ స్టేషన్ వద్ద బస్సులు నీటిలో ముందుకు కదల్లేక నిలిచిపోయాయి.
మొగల్రాజపురం సున్నపుబట్టి సెంటర్ వద్ద కొండచరియలు విరిగిపడి ఓ బాలిక మృతి చెందిన సంగతి తెలిసిందే. శిథిలాల కింద మరికొందరు చిక్కుకుని ఉన్నట్టు తెలుస్తోంది.