Mallu Bhatti Vikramarka: పవర్ ప్లాంట్ ఏర్పాటుపై సీఎం రేవంత్ రెడ్డితో చర్చించాం: భట్టివిక్రమార్క
- రామగుండంలో 800 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామన్న భట్టివిక్రమార్క
- సింగరేణి-జెన్కో కలిసి పవర్ ప్రాజెక్టును ప్రారంభించే దిశగా చర్యలు చేపడతామని వెల్లడి
- త్వరలో పవర్ ప్రాజెక్టుకు టెండర్లు పిలుస్తామన్న భట్టివిక్రమార్క
రామగుండంలో 800 మెగావాట్ల విద్యుత్ పవర్ ప్లాంట్ ఏర్పాటుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చించామని తెలంగాణ ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క తెలిపారు. ఈ పవర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలనే నిర్ణయానికి వచ్చామన్నారు. ఆయన రామగుండంలో 'బి పవర్ హౌస్'ను సందర్శించారు. పలు అభివృద్ధి పనులకు శుంకుస్థాపన చేశారు.
అనంతరం ఉపముఖ్యమంత్రి మాట్లాడుతూ... కొద్ది రోజుల్లోనే పవర్ ప్రాజెక్టుపై సానుకూల నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. సింగరేణి - జెన్కో జాయింట్‌గా పవర్ ప్రాజెక్టును ప్రారంభించే దిశగా చర్యలు చేపడతామన్నారు. అందరి కోరిక మేరకు 'బి పవర్ హౌస్' ప్రాజెక్టును ముందుకు తీసుకువెళతామన్నారు.
త్వరలో పవర్ ప్రాజెక్టుకు టెండర్లు పిలుస్తామన్నారు. భూసేకరణ కోసం ప్రతిపాదనలు పంపించాలని అధికారులకు సూచించామన్నారు. ఇక్కడ పవర్ ప్రాజెక్టును విస్తరించాలని స్థానిక మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు తన దృష్టికి తీసుకువచ్చారన్నారు.
ఇక్కడి జెన్ కో ప్లాంట్‌తో ప్రజలకు విడదీయరాని బంధం ఉందన్నారు. సింగరేణి కార్మికులకు కోటి రూపాయల ప్రమాద బీమా సౌకర్యం కల్పించామన్నారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రతి నియోజకవర్గం పరిధిలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు.