Shanthi Kumari: భారీ వర్షాలు... స్కూళ్లకు సెలవులపై సీఎస్ శాంతికుమారి స్పందన
- వర్షాలపై జిల్లాల కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్
- ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచన
- వరదలు వస్తే సమర్థవంతంగా ఎదుర్కొనేలా ఉండాలన్న సీఎస్
తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో ఆయా జిల్లాల్లో పాఠశాలలకు సెలవులపై కలెక్టర్లదే నిర్ణయమని తెలంగాణ సీఎస్ శాంతికుమారి తెలిపారు. వర్షాలపై జిల్లాల కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
జిల్లాల్లో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు సూచించారు. వరదలు వస్తే సమర్థవంతంగా ఎదుర్కొనేలా సిద్ధంగా ఉండాలన్నారు. కొన్ని ప్రాంతాల్లో క్లౌడ్ బరస్ట్ అయ్యే అవకాశాలున్నాయని హెచ్చరించారు.
ప్రజలను అప్రమత్తం చేసేందుకు కంట్రోల్ రూంలను ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రజలు లోతట్టు, వరద ప్రాంతాలకు వెళ్లకుండా చూడాలన్నారు. ఉద్ధృతంగా ప్రవహించే వాగుల వద్ద ఒక అధికారితో పర్యవేక్షించాలన్నారు. మంచి నీటి ట్యాంకులు కలుషితం కాకుండా చూడాలని సూచన చేశారు. మ్యాన్ హోళ్లు తెరవకుండా చూడాలన్నారు.