Nara Lokesh: నూజివీడు ట్రిపుల్ ఐటీలో విద్యార్థులకు అస్వస్థత... డైరెక్టర్ ను తొలగించిన మంత్రి నారా లోకేశ్
- ఇటీవల నూజివీడులో ట్రిపుల్ ఐటీలో కలుషితాహారం కలకలం
- పెద్ద సంఖ్యలో అస్వస్థతకు గురైన విద్యార్థులు
- ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న మంత్రి నారా లోకేశ్
ఇటీవల నూజివీడులో కలుషితాహారం తిని పెద్ద ఎత్తున విద్యార్థులు అనారోగ్యానికి గురైన ఘటనను రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ సీరియస్ గా తీసుకున్నారు. విద్యార్థుల ఆహారం విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన నూజివీడు ట్రిపుల్ ఐటీ డైరక్టర్ ను ఆ బాధ్యతలనుంచి తప్పిస్తూ తాజాగా నిర్ణయం తీసుకున్నారు.
అక్కడ విద్యనభ్యసిస్తున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో నమ్మకం పెంపొందించేందుకు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా నూజివీడు ట్రిపుల్ ఐటీ పర్యవేక్షణ కోసం త్రిసభ్య కమిటీని నియమించారు. ఇందులో కాలేజి ఎడ్యుకేషన్ కమిషనర్ పోలా భాస్కర్, ఉన్నత విద్యశాఖ ఇన్ ఛార్జి చైర్మన్ రామ్మోహన్ రావు, ఏలూరు కలెక్టర్ కె. వెట్రి సెల్వి సభ్యులుగా ఉంటారు.
ఆహార నాణ్యత, చిన్న చిన్న మరమ్మతులు, కొన్ని సున్నితమైన అంశాలు, వైద్య పర్యవేక్షణపై ఫిర్యాదులు వంటి సమస్యల తక్షణ పరిష్కారానికి నిర్ణీత సమయంతో కూడిన కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని మంత్రి నారా లోకేశ్ పర్యవేక్షక కమిటీకి సూచించారు.
ఏవైనా అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకున్న వెంటనే కమిటీ ఆ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి, సత్వర పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటుందని లోకేశ్ వివరించారు.