Commercial LPG gas: కమర్షియల్ గ్యాస్ వినియోగదారులకు షాక్.. పెరిగిన ధరలు
- 19 కేజీల ఎల్పీజీ గ్యాస్ ధరను రూ.39 మేర పెంచిన ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు
- నేటి నుంచే అమల్లోకి రానున్న సవరించిన ధరలు
- గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధరలు యథాతథం
కమర్షియల్ గ్యాస్ వినియోగదారులకు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు షాక్ ఇచ్చాయి. 19 కేజీల ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలను రూ.39 మేర పెంచాయి. ఈ మేరకు ఇవాళ (సెప్టెంబర్ 1) ధరలను సవరించాయి. పెరిగిన ధరలు నేటి నుంచే అమల్లోకి రానున్నాయి. కాగా 14 కేజీల గృహవినియోగ గ్యాస్ ధరలో ఎలాంటి మార్పు లేదు.
కాగా 19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ రేట్లను సవరించడం వరుసగా ఇది మూడవసారి. గత నెల జులైలో స్వల్పంగా రూ. 8.50 మేర పెంచాయి. అయితే అంతకుముందు నెల జులైలో రూ.69 మేర తగ్గించిన విషయం తెలిసిందే. తాజా పెంపుతో దేశ రాజధాని ఢిల్లీలో 19 కేజీల కమర్షియల్ గ్యాస్ రిటైల్ ధర రూ.1,691.50కి చేరింది.
కాగా ఎల్పీజీ ధరలు ఆకస్మికంగా పెరగడంతో వివిధ రంగాలలోని ఈ గ్యాస్‌ను వినియోగిస్తున్న వ్యాపారులపై స్వల్ప భారం పడనుంది. రెస్టారెంట్లు, హోటళ్ల నుంచి చిన్న తరహా పరిశ్రమలకు చెందినవారిపై ఖర్చుల భారం పెరగనుంది.