mammootty: హేమ కమిటీ సూచనలను స్వాగతిస్తున్నా: మమ్ముట్టి
- మలయాళ ఇండస్ట్రీలో లైంగిక వేధింపులపై సంచలన విషయాలను వెల్లడించిన హేమ కమిటీ
- మహిళలకు ఇబ్బందికర పరిస్థితులు ఎదురుకాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వ్యాఖ్య
- ఇండస్ట్రీలో 'పవర్ సెంటర్' అంటూ ఏదీ లేదన్న మమ్ముట్టి
మలయాళ సినీ పరిశ్రమను హేమ కమిటీ రిపోర్ట్ కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. ఇండస్ట్రీలోని లైంగిక వేధింపులపై సంచలన నిజాలను కమిటీ వెలుగులోకి తీసుకొచ్చింది.
ఈ నేపథ్యంలో ప్రముఖ మలయాళ నటుడు మమ్ముట్టి ఫేస్ బుక్ ద్వారా స్పందిస్తూ... షూటింగ్ ప్రదేశాల్లో మహిళలకు సురక్షిత వాతావరణం కలిగించేందుకు కమిటీ చేసిన సూచనలను స్వాగతిస్తున్నానని తెలిపారు. షూటింగ్ సెట్స్ లో మహిళలకు ఇబ్బందికర పరిస్థితులు ఎదురుకాకుండా దర్శకనిర్మాతలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
కమిటీ ఇచ్చిన నివేదికలోని సూచనలను అమలు చేసేందుకు చిత్ర పరిశ్రమలోని అన్ని అసోసియేషన్స్ ఏకతాటిపైకి రావాలని మమ్ముట్టి విన్నవించారు. హేమ కమిటీ నివేదిక కోర్టు ముందు ఉందని.. నిందితులకు కోర్టు శిక్షలను నిర్ణయిస్తుందని చెప్పారు. సినీ పరిశ్రమలో 'పవర్ సెంటర్' అంటూ ఏదీ లేదని అన్నారు. అంతిమంగా సినిమా బతకాలని వ్యాఖ్యానించారు.