Andhra Pradesh: విజయవాడ, ఖమ్మం మార్గాల్లో ప్రయాణించాల్సిన వారికి హైదరాబాద్ పోలీసుల అలర్ట్

who have to travel via Vijayawada and Khammam routes suggested the journeys should be postponed

  • ప్రయాణాలు వాయిదా వేసుకోవాలంటూ హైదరాబాద్‌ ట్రాఫిక్‌ అదనపు కమిషనర్‌ పి.విశ్వప్రసాద్‌ సూచన
  • భద్రత దృష్ట్యా వాయిదా వేసుకోవడమే మంచిదని వెల్లడి
  • పలు చోట్ల జాతీయ రహదారి మీదకు వచ్చిన నీరు

మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు తెలుగు రాష్ట్రాలను అతలాకుతలం చేస్తున్నాయి. ఊహించని రీతిలో వరదలు ఉప్పొంగడంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. చిల్లకల్లు, నందిగామ దగ్గర వరద నీరు జాతీయ రహదారి మీదకు రావడం, ఖమ్మంలో పాలేరు నది ఉప్పొంగి ప్రవహిస్తుండడంతో ఖమ్మం, విజయవాడ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని హైదరాబాద్‌ ట్రాఫిక్‌ అదనపు కమిషనర్‌ పి.విశ్వప్రసాద్‌ సూచన చేశారు. భద్రత రీత్యా ఈ రెండు ప్రాంతాలకు వెళ్లాలనుకునే ప్రజలు ప్రయాణాన్ని వాయిదా వేసుకోవడం మంచిదని పేర్కొన్నారు.

అయితే అత్యవసర పరిస్థితుల్లో విజయవాడ వెళ్లాలని భావిస్తే హైదరాబాద్ నగరంలోని చౌటుప్పల్, చిట్యాల, నార్కెట్‌పల్లి, నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, గుంటూరు మీదుగా ప్రయాణించాలని సూచించారు. ఇక ఖమ్మం నగరానికి చౌటుప్పల్, చిట్యాల, నకిరేకల్, అర్వపల్లి, తుంగతుర్తి, మద్దిరాల, మర్రిపేట బంగ్లా మీదుగా వెళ్లాలని వివరించారు. 

ఇక వర్షాలు, వరదల నేపథ్యంలో ఎక్కడైనా అనూహ్యంగా అత్యవసర పరిస్థితి ఎదురైతే సాయం కోసం హైదరాబాద్‌ ట్రాఫిక్‌ హెల్ప్‌లైన్‌ నంబర్ 90102 03626ను సంప్రదించాలని కోరారు. ఈ మేరకు హైదరాబాద్‌ ట్రాఫిక్‌ అదనపు కమిషనర్‌ విశ్వప్రసాద్‌ ఎక్స్ వేదికగా ఆదివారం సూచన చేశారు.

కాగా భారీ వర్షాలు అటు విజయవాడను, ఇటు ఉమ్మడి ఖమ్మం జిల్లాను వణికిస్తున్నాయి. పలు ప్రాంతాలు నీటమునిగాయి. ముఖ్యంగా ఖమ్మం నగర ప్రాంతంలో వరద బీభత్సం సృష్టిస్తోంది. నగరంలోని రాజీవ్ గృహకల్ప కాలనీ, వెంకటేశ్వర నగర్, గణేశ్ నగర్ తదితర ప్రాంతాలను మున్నేరు వరద ముంచెత్తింది. తమను కాపాడాలంటూ కొందరు తమ ఇళ్లపైకి చేరి సాయం కోసం ఎదురు చూస్తున్నారు.

  • Loading...

More Telugu News