Droupadi Murmu: రేప్‌ వంటి నేరాల్లో కోర్టుల జాప్యంతో సామాన్యులు అసహనానికి గురవుతున్నారు: రాష్ట్రపతి ముర్ము

Common people are getting impatient over courts delay in crimes like rape says President Droupadi Murmu

  • న్యాయస్థానాల్లో ఎక్కువ కాలంగా పెండింగ్‌‌లో ఉన్న కేసులు పెద్ద సవాలు అని వ్యాఖ్య
  • త్వరగా పరిష్కారం అయ్యేలా మార్పులు తీసుకురావాలని పిలుపు
  • కోర్ట్ వాయిదాల సంస్కృతిని మార్చాలని సూచించిన రాష్ట్రపతి

కోల్‌కతా ట్రైనీ వైద్యురాలిపై హత్యాచారం ఘటనపై దేశవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్న వేళ రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తీవ్రమైన రేప్‌ కేసుల వంటి నేరాల్లో కూడా న్యాయస్థాల తీర్పు జాప్యంతో సామాన్యులు అసహనం చెందుతున్నారని ఆమె వ్యాఖ్యానించారు. న్యాయస్థానాల్లో ఎక్కువ కాలంగా పెండింగ్‌‌లో ఉన్న కేసులు పెద్ద సవాలు అని, కోర్టులకు సున్నితత్వం లేదనే అభిప్రాయానికి జనాలు వస్తున్నారని పేర్కొన్నారు. కోర్టు వాయిదాల సంస్కృతిని మార్చండి అంటూ రాష్ట్రపతి వ్యాఖ్యానించారు. న్యాయస్థానాల్లో వాయిదాల విధానాన్ని మార్చేందుకు తగిన అన్ని ప్రయత్నాలు చేయాలని, కోర్టుల తీర్పుల్లో వేగం పెంచాలని, లోక్‌ అదాలత్‌లను నిర్వహించాలని న్యాయాధికారులకు ఆమె సూచించారు. ఆదివారం జరిగిన జిల్లాల న్యాయ వ్యవస్థల జాతీయ సదస్సు ముగింపు కార్యక్రమంలో ఆమె పాల్గొని ప్రసంగించారు.

దేశంలో న్యాయాన్ని రక్షించాల్సిన బాధ్యత అందరు జడ్జిలపై ఉందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సూచించారు. న్యాయస్థానాల్లో నెలకొనే వాతావరణం వల్ల సామాన్యుల్లో ఒత్తిడి పెరుగుతోందని, సామాన్యుల్లో నల్లకోటు భయం ఉందని అన్నారు. దీనిపై అధ్యయనం జరగాలని సూచించారు. హాస్పిటల్‌లో వాతావరణం చూడగానే జనాల్లో బీపీ పెరుగుతున్న విధంగా, నల్ల కోటును చూడగానే ఆందోళన చెందుతున్నారని ఆమె వ్యాఖ్యానించారు.

గ్రామాల్లో నివసించే పేదలు న్యాయస్థానాలకు వెళ్లాలంటేనే జంకుతున్నారని రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము వ్యాఖ్యానించారు. మానసికంగా, ఆర్థికంగా ఒత్తిడికి గురవుతున్నారని ముర్ము పేర్కొన్నారు. కొన్ని తీవ్రమైన నేరాలకు సంబంధించిన కేసుల్లో నిందితులు యథేచ్ఛగా తిరగడం కలవరం కలిగిస్తోందని ఆమె అన్నారు. బాధితులు ఆందోళనతో జీవించాల్సి వస్తోందని అన్నారు.

ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ కూడా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. న్యాయ వ్యవస్థలో జాతీయ న్యాయ నియామక ప్రక్రియ అవసరమని సూచించారు. నిర్ణీత సమయంలో ఖాళీలు భర్తీ చేయాల్సిన అవశ్యకత ఉందని తెలిపారు. సౌకర్యాల పరంగా జిల్లా స్థాయి కోర్టులు మహిళలకు అంత అనుకూలంగా లేవని అన్నారు. పెండింగ్‌ కేసుల పరిష్కారానికి ఏర్పాటు చేసిన జడ్జిల కమిటీ త్వరలో కార్యాచరణ ప్రణాళికను అందజేస్తుందని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News