Heavy Rains: ప్రయాణికులకు గమనిక.. 432 రైళ్ల రద్దు
- తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు
- సూపర్‌ఫాస్ట్, ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్ రైళ్ల రద్దు
- తెలంగాణలో నిలిచిపోయిన వందలాది బస్సులు
ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా దక్షిణ మధ్య రైల్వే ఇప్పటి వరకు 432 రైళ్లను రద్దు చేసింది. 140 రైళ్లను దారి మళ్లించగా, 13 రైళ్లను పాక్షికంగా రద్దు చేసినట్టు అధికారులు తెలిపారు. రద్దు చేసిన రైళ్లలో పలు సూపర్ ఫాస్ట్, ఎక్స్‌ప్రెస్ రైళ్లతోపాటు ప్యాసింజర్ రైళ్లు కూడా ఉన్నాయి. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని దక్షిణ మధ్య రైల్వే కోరింది.
వందలాది బస్సు సర్వీసులు రద్దు
మరోవైపు, భారీ వర్షాల కారణంగా రోడ్లు దెబ్బతినడం, కొట్టుకుపోవడం, నీళ్లు చేరడంతో హైదరాబాద్-విజయవాడ మధ్య రోడ్డు రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. తెలంగాణ ఆర్టీసీ ఇప్పటి వరకు 560కిపైగా సర్వీసులను రద్దు చేసింది. ఖమ్మం జిల్లాలో 160, వరంగల్‌లో 150, రంగారెడ్డి జిల్లాలో 70కిపైగా బస్సులను నిలిపివేసినట్టు ఆర్టీసీ అధికారులు తెలిపారు.