AAP MLA: ఆప్ ఎమ్మెల్యే అనుమానమే నిజమైంది.. సోదాల తర్వాత అమానతుల్లా ఖాన్ అరెస్ట్
- తలుపు తట్టిన ఈడీ అధికారులతో అమానతుల్లా ఖాన్ వాగ్వాదం.. వైరల్ గా మారిన వీడియో
- అరెస్టు చేస్తామని ఎందుకు అనుకుంటున్నారని ప్రశ్నించిన అధికారి
- లేకుంటే మూడు గదుల ఇంట్లో ఏం సోదా చేయడానికి వచ్చారని నిలదీసిన ఎమ్మెల్యే
- నాటకీయ పరిణామాల మధ్య అమానతుల్లా ఖాన్ ను తరలించిన అధికారులు
ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ అనుమానమే నిజమైంది.. సోదాల పేరుతో సోమవారం ఆయన ఇంటికి చేరుకున్న ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు చివరకు ఆయనను అరెస్టు చేస్తున్నట్లు ప్రకటించారు. నాటకీయ పరిణామాల మధ్య, ఇంటిముందు భారీగా బలగాలను మోహరించి ఆయనను తరలించారు. ఢిల్లీ వక్ఫ్ బోర్డు నియామకాల్లో అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలపై అమానతుల్లా ఖాన్ ను అరెస్టు చేసినట్లు వెల్లడించారు. సోమవారం ఉదయం ఏడు గంటలకే అమానతుల్లా ఖాన్ ఇంటికి ఈడీ అధికారులు చేరుకున్నారు.
సోదాలకు సంబంధించి జారీ అయిన వారెంట్ చూపుతూ తలుపులు తెరవాలని కోరారు. మెయిన్ డోర్ తెరిచినా గ్రిల్ లాక్ చేయడంతో అధికారులు ఇంట్లోకి వెళ్లలేకపోయారు. ఈ సందర్భంగా ఈడీ అధికారులకు, ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్, ఆయన కుటుంబ సభ్యుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. తనను అరెస్టు చేయడానికే వచ్చారంటూ అమానతుల్లా ఖాన్ ఆరోపించగా.. అలా ఎందుకు అనుకుంటున్నారంటూ ఈడీ అధికారి ఒకరు ఎదురు ప్రశ్నించారు. దీనిపై మండిపడ్డ ఎమ్మెల్యే.. అరెస్టు చేయడానికి కాకుంటే మూడు గదులు ఉన్న ఇంట్లో ఏం సోదాలు చేయడానికి వచ్చారంటూ అధికారులను నిలదీశారు.
కేన్సర్ పేషెంట్ అయిన తన అత్తగారు ఇంట్లో ఉన్నారని, నాలుగు రోజుల కిందటే తనకు ఆపరేషన్ అయిందని చెప్పినా వినిపించుకోలేదని ఫైర్ అయ్యారు. నాలుగు వారాల గడువు కావాలని కోరినా తిరస్కరించారని, కనీస మానవత్వం కూడా చూపడంలేదని అధికారుల తీరును ఎమ్మెల్యే తప్పుబట్టారు. ఈడీ అధికారులకు, ఎమ్మెల్యేకు మధ్య జరిగిన వాగ్వాదానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఆప్ పై కక్షగట్టిన కేంద్ర ప్రభుత్వం పార్టీ నేతలపై వేధింపులకు పాల్పడుతోందని అమానతుల్లా ఖాన్ ఆరోపించారు. రెండేళ్లుగా అధికారులు తనను వేధిస్తున్నారని, అయినా తాము వెరవకుండా ఫైట్ చేస్తున్నామని చెప్పారు. ఢిల్లీ వక్ఫ్ బోర్డులో అవకతవకల ఆరోపణలను ఎమ్మెల్యే కొట్టిపారేశారు. ఆమ్ ఆద్మీ పార్టీని చీల్చడమే వారి లక్ష్యమని, అందులో భాగంగానే తప్పుడు కేసులతో తమను వేధిస్తున్నారని తీవ్రంగా మండిపడ్డారు. ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ ఇంట్లో సోదాలు జరిపిన తర్వాత ఎమ్మెల్యేను అరెస్టు చేస్తున్నట్లు ప్రకటించిన అధికారులు.. భద్రతా బలగాల సాయంతో ఆయనను తీసుకెళ్లారు.