Sheikh Hasina: హసీనా అప్పగింత విషయంలో భారత్ నుంచి సరైన స్ప్నదన లేదు: బంగ్లాదేశ్

Indias call whether to hand over Hasina or not Says Bangladesh Govt Adviser
  • ఇరు దేశాల మధ్య ఒప్పందం ఉందన్న బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ అడ్వైజర్
  • అప్పగించాలా? వద్దా? అనేది భారత ప్రభుత్వమే తేల్చుకోవాలని వ్యాఖ్య
  • హసీనా భారత్ లో ఎక్కడుందో తెలుసా అన్న ప్రశ్నకు మండిపాటు
  • ఆ విషయం భారత ప్రభుత్వాన్నే అడగాలని సూచన
విద్యార్థుల ఆందోళనలతో పదవికి రాజీనామా చేసి హుటాహుటిన భారతదేశానికి వచ్చిన బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు ఇబ్బందులు తప్పేలా లేవు. హసీనా అప్పగింత విషయంలో బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం గట్టి పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై బంగ్లా విదేశాంగ శాఖ సలహాదారు ఎండీ తౌహిద్ హుస్సేన్ తాజాగా మీడియాతో మాట్లాడారు. భారత్, బంగ్లాదేశ్ ల మధ్య నేరస్థుల అప్పగింతకు సంబంధించిన ఒప్పందం ఉందని చెప్పారు. హసీనాపై బంగ్లాదేశ్ లో మూడు మర్డర్ కేసులతో పాటు ఇతరత్రా కేసులు నమోదైన విషయం గుర్తుచేశారు. హసీనాను తమకు అప్పగించాలని, స్వదేశంలో ఆమె విచారణను ఎదుర్కొనేందుకు సహకరించాలని భారత ప్రభుత్వానికి ఇప్పటికే విజ్జప్తి చేశామని హుస్సేన్ చెప్పారు.

అయితే, ఎన్నిమార్లు విజ్జప్తి చేసినా భారత ప్రభుత్వం నుంచి సరైన స్పందన రాలేదని మీడియాకు వివరించారు. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని హసీనాను అప్పగించాలా? వద్దా? అనే విషయంపై నిర్ణయం తీసుకోవాల్సింది భారత ప్రభుత్వమేనని చెప్పారు. అయితే, హసీనాపై నమోదైన కేసుల్లో విచారణ జరపాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకోసం ఆమెను తప్పకుండా బంగ్లాదేశ్ కు రప్పించాలని చెబుతూ.. ఈ విషయంలో బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం ఏంచేయడానికైనా వెనకాడదని స్పష్టం చేశారు. ఇక, హసీనా భారత దేశంలో ఎక్కడ తలదాచుకున్నారనేది బంగ్లా ప్రభుత్వానికి తెలుసా? అని మీడియా ప్రశ్నించగా.. ఆ విషయం భారత ప్రభుత్వాన్నే అడగాలంటూ హుస్సేన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Sheikh Hasina
Bangladesh
India
Hasina Exportation

More Telugu News