Road: హైదరాబాద్-విజయవాడ రహదారిపై కిలోమీటర్ల మేర నిలిచిన లారీలు

Traffic jam between Hyderabad and Vijayawada High way

  • గరికపాడు వద్ద రోడ్డు కొట్టుకుపోవడంతో నిలిచిపోయిన లారీలు
  • మరో దగ్గరి మార్గం లేక అక్కడే వేచి చూస్తున్న డ్రైవర్లు
  • వాహనాలను మిర్యాలగూడ వైపు మళ్లిస్తున్న పోలీసులు

భారీ వర్షాలు, వరదల కారణంగా గరికపాడు వద్ద రోడ్డు కొట్టుకుపోవడంతో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై 3 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వందలాది సరుకు లారీలు నిలిచిపోయాయి. 

అక్కడి నుంచి వెళ్లడానికి మరో దగ్గరి మార్గం లేక లారీ డ్రైవర్లు వేచి చూస్తున్నారు. డ్రైవర్లు రోడ్డు పైనే భోజనం చేస్తున్నారు. కోదాడకు చేరుకున్న వాహనాలను పోలీసులు మిర్యాలగూడ వైపుకు మళ్లిస్తున్నారు. వాహనదారులు కోదాడ వైపు రావొద్దని కోదాడ డీఎస్పీ శ్రీధర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

భారీ వర్షాల కారణంగా టీజీఎస్ ఆర్టీసీ తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాలకు బస్సులను రద్దు చేసింది. ఆదివారం రాత్రి వరకు 877 బస్సులను రద్దు చేసింది. సోమవారం ఉదయం నుంచి మరో 570 బస్సులు రద్దయ్యాయి. దీంతో మొత్తం 1400కు పైగా బస్సులు రద్దైనట్లు ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. 

ఖమ్మం, విజయవాడ, మహబూబాబాద్ మార్గాల్లో వెళ్లే బస్సులు పూర్తిగా రద్దయినట్లు తెలిపారు. హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్లే బస్సులను గుంటూరు మీదుగా మళ్లించినట్లు తెలిపారు. వరదల కారణంగా పలు జిల్లాల్లో నడపాల్సిన వాటిలో సగం బస్సులు కూడా నడవడం లేదు.

  • Loading...

More Telugu News