Hyderabad: అత్యవసరమైతే తప్ప హైదరాబాద్ వాసులు బయటకు రావొద్దు: జీహెచ్ఎంసీ
- భారీ వర్షాలతో నాలాల్లో పొంగుతున్న నీరు
- నాలాలు, చెరువులు, లోతట్టు ప్రాంతాల వద్దకు వెళ్లవద్దని సూచన
- పిల్లలు, వృద్ధులను అనవసరంగా బయటకు పంపించవద్దన్న జీహెచ్ఎంసీ
- ఇంట్లోనే ఉండండి... జాగ్రత్తగా ఉండండన్న జీహెచ్ఎంసీ
అత్యవసరమైతే తప్ప భాగ్యనగరవాసులు బయటకు రావొద్దని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (జీహెచ్ఎంసీ) అధికారులు ప్రకటన జారీ చేశారు. భారీ వర్షాలు కురవడంతో పలు ప్రాంతాల్లో వరదలు వస్తున్నాయని, నాలాలు పొంగిపొర్లుతున్నాయని తెలిపింది. ప్రజలు నాలాలు, చెరువులు, లోతట్టు ప్రాంతాల వద్దకు వెళ్లవద్దని సూచించింది.
వాహనదారులు, పాదచారులు రోడ్డుపై వెళ్లేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. పిల్లలు, వృద్ధుల పట్ల జాగ్రత్తగా ఉండాలని, వారిని అనవసరంగా బయటకు పంపించకూడదని సూచించింది. "ఇంట్లోనే ఉండండి... జాగ్రత్తగా ఉండండి... మీ భద్రత మా బాధ్యత" అని జీహెచ్ఎంసీ పేర్కొంది.
నిర్మాణాలకు విరామం ఇవ్వాలన్న క్రెడాయ్
భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణలో నిర్మాణాలకు తాత్కాలికంగా విరామం ఇవ్వాలని క్రెడాయ్ (కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా) సూచించింది. సెప్టెంబర్ 1 నుంచి పలు ప్రాంతాల్లో రెడ్, ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్ జారీ అయిన విషయాన్ని గుర్తు చేసింది.