amerca: అమెరికాలో 'ట్రిపుల్ ఈ' వైరస్ కలకలం
- మసాచుసెట్స్ రాష్ట్రంలో ట్రిపుల్ ఈ వైరస్‌తో ఒకరి మృతి
- ఐదు పట్టణాల్లో పాక్షిక లాక్ డౌన్ విధించిన అధికారులు
- ఎవరికి వారు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్న అధికార యంత్రాంగం
ప్రపంచాన్ని కరోనా వైరస్ ఏ విధంగా ఇబ్బందులపాలు చేసిందో ఎవరూ మరచిపోరు. ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలను కరోనా వైరస్ వణికించింది. వైరస్ వ్యాప్తి నిరోధానికి లాక్ డౌన్లను విధించారు. మెల్లగా కరోనాను మరిచిపోతున్న తరుణంలో అమెరికాలో వెలుగుచూసిన మరో ప్రాణాంతక వైరస్ ఆందోళన కలిగిస్తోంది. దోమకాటు కారణంగా అమెరికాలోని మసాచుసెట్స్ రాష్ట్రంలో 'ట్రిపుల్ ఈ' వైరస్ బారిన ప్రజలు పడుతున్నారు. తాజాగా ఈ వైరస్ సోకిన న్యూహాంప్ షైర్ కు చెందిన వ్యక్తి ఒకరు మృతి చెందినట్లు తెలుస్తోంది. మరో 80 ఏళ్ల వృద్ధుడు ఆసుపత్రిలో కొనఊపిరితో కొట్టుమిట్టాడుతుండటం చర్చనీయాంశంగా మారింది. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. అధికారులు హైఅలర్ట్ ప్రకటించారు. ముందస్తు జాగ్రత్తగా అక్కడి ఐదు పట్టణాల్లో పాక్షిక లాక్ డౌన్ విధించారు.
ఈ వైరస్ సోకిన వారిలో జ్వరం, తలనొప్పి, వికారం, వాంతులు, డయేరియా, ఫిట్స్ వంటి లక్షణాలు కనబడతాయి. దోమకాటు మూలంగా ఈ వైరస్ విస్తరిస్తుంది. ట్రిపుల్ ఈ వైరస్ కు ఎలాంటి మందు లేదని, ఎవరికివారు ముందు జాగ్రత్తలు తీసుకోవాలని స్థానిక యంత్రాంగం సూచిస్తోంది. వైరస్ సోకిన వారిలో 33 నుండి 70 శాతం మంది మరణించే అవకాశాలు ఉన్నాయని యూఎస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (సీడీసీ) హెచ్చరించింది. ఇన్ ఫెక్షన్ సోకిన ఇతరుల్లో నరాల సమస్యలు వెంటాడుతాయని వెల్లడించింది.