Lie Detector Test: ఆస్ట్రేలియా క్రికెటర్లకు లై డిటెక్టర్ టెస్టు.. దొరికిపోయిన ఆటగాళ్లు.. నెట్టింట ఫన్నీ వీడియో వైరల్!
- ఓ టెలివిజన్ షోలో ఆసీస్ ప్లేయర్లకు సరదాగా లై డిటెక్టర్ టెస్టు
- టెస్టులో పాల్గొన్న కమ్మిన్స్, మిచెల్ మార్ష్, ఖవాజా, హేజిల్‌వుడ్,హెడ్, లబూషేన్
- కంగారూ ఆటగాళ్లకు పలు వివాదాస్పద, ఆసక్తికర ప్రశ్నలను సంధించిన నిర్వాహకులు
- తప్పుడు జవాబులతో దొరికిపోయి షాక్ తిన్న కొందరు ఆటగాళ్లు
తాజాగా ఆస్ట్రేలియా క్రికెటర్లకు ఓ టెలివిజన్ షోలో సరదాగా లై డిటెక్టర్ టెస్టు నిర్వహించారు. ఇందులో భాగంగా క్రికెటర్లు ఉల్లాసంగా సమాధానం చెప్పడం కనిపించింది. అయితే, కొన్ని ఇబ్బందికర ప్రశ్నలకు బదులిచ్చేటప్పుడు క్రికెటర్లు తడబడ్డారు. అలా కొందరు ‘తప్పు’ సమాధానం చెప్పినందుకు షాక్ కూడా తిన్నారు. ఈ పాలీగ్రాఫ్ పరీక్షలో ప్యాట్ కమ్మిన్స్, మిచెల్ మార్ష్, ఉస్మాన్ ఖవాజా, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, మార్నస్ లబూషేన్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నిర్వాహకులు ఆస్ట్రేలియా క్రికెటర్లకు తొలి రౌండ్‌లో మీ అసలు పేరు ఏంటీ? అని అడిగారు. ఆ తర్వాత కంగారూ ఆటగాళ్లకు పలు వివాదాస్పద, ఆసక్తికర ప్రశ్నలను సంధించారు. వాటికి క్రికెటర్లు సరదాగా జవాబులు చెప్పారు. కొందరు నిజాయతీగా జవాబులు చెబితే, మరికొందరు తప్పుడు సమాధానాలు చెప్పి అవాక్కయ్యారు.
ఈ టెస్టులో గతేడాది వన్డే ప్రపంచకప్‌లో శతకంతో ఆసీస్‌కు ట్రోఫీ అందించిన ట్రావిస్ హెడ్ అడ్డంగా దొరికిపోవడం హైలైట్‌గా నిలిచింది. వరల్డ్‌కప్ టైటిల్ గెలిచిన తర్వాత నువ్వు ఎన్ని బీర్లు తాగావు? అనే ప్రశ్న అతనికి ఎదురైంది. దీనికి హెడ్ తప్పుడు సమాధానం చెప్పడంతో దొరికిపోవడం జరిగింది. ఇలా ఆస్ట్రేలియన్ క్రికెటర్లుకు నిర్వహించిన ఈ సరదా పాలీగ్రాఫ్ పరీక్ష తాలూకు వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.