Chandrababu: భార్య ప్రాణాలు కాపాడాలని ఆయన వేడుకోవడం ఎంతో బాధను కలిగించింది: చంద్రబాబు
- అర్ధరాత్రి 11.30 గంటలకు ఉన్నతాధికారులతో చంద్రబాబు సమీక్ష
- రాబోయే మూడు రోజులు అధికార యంత్రాంగం సమర్థవంతంగా పని చేయాలన్న సీఎం
- ప్రతి బాధితుడిని ఆదుకున్న తర్వాతే ఇక్కడి నుంచి వెళ్తానని వ్యాఖ్య
విజయవాడ వరద ముంపు ప్రాంతాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా పర్యటిస్తూ అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు. వరద సహాయక చర్యలపై నిన్న అర్ధరాత్రి 11.30 గంటలకు ఆయన ఉన్నతాధికారులు, అందుబాటులో ఉన్న మంత్రులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... ఎన్ని రకాలుగా ప్రయత్నించినప్పటికీ ముంపు ప్రాంతాల చివర ఉన్నవారికి ఆహార పొట్లాలను అందించలేకపోవడం బాధాకరంగా ఉందని చెప్పారు. ముంపు ప్రాంతాల ప్రారంభంలోనే ఆహార పొట్లాలను బాధితులు తీసుకుంటుండటంతో... అవి చివరి వరకు చేరలేకపోతున్నాయని తెలిపారు.
తాను వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నప్పుడు ఓ వ్యక్తి ఏడాది వయసున్న బాబును పట్టుకుని బయటకు వచ్చాడని... సార్, బాబు ప్రాణాలను కాపాడుకోవడానికి ఇంట్లో భార్యను వదిలేసి బయటకు వచ్చానని చెప్పాడని... తన భార్య ఫలానా చోట ఉందని, ఆమె ప్రాణాలు మీరే కాపాడాలంటూ వేడుకోవడం తనకు ఎంతో బాధను కలిగించిందని సీఎం తెలిపారు. ఒకచోట వృద్ధ దంపతులు వరద నీటిలో తడిసిపోయి, నిస్సహాయ స్థితిలో కనిపించారని... వారి స్థితి తనను కలచివేసిందని చెప్పారు.
సింగ్ నగర్ ప్రాంతంలో వరద ఉద్ధృతి తగ్గుముఖం పట్టిందని... ఈ కష్టకాలంలో విధినిర్వహణలో అధికారులు అలసత్వం వహించవద్దని ముఖ్యమంత్రి హెచ్చరించారు. రాబోయే మూడు రోజులు ప్రభుత్వ యంత్రాంగం సమర్థవంతంగా పని చేయాలని చెప్పారు. వరద తగ్గాక పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచి, పునరావాసం కల్పించాలని అన్నారు. ప్రతి ఒక్క బాధితుడిని ఆదుకున్న తర్వాతే తాను ఇక్కడి నుంచి బయల్దేరుతానని చెప్పారు.