Cow Smuggler: ఆవులను స్మగ్లింగ్ చేస్తున్నాడని భ్రమపడి.. 30 కిలోమీటర్లమేర వెంటాడి 12వ తరగతి విద్యార్థి కాల్చివేత

Haryana Student Mistaken For Cow Smuggler And Chased For 30 Km Shot Dead
  • హన్యాలోని ఫరీదాబాద్‌లో ఘటన
  • అనుమానంతో విద్యార్థి ప్రాణం తీసిన గో సంరక్షకులు
  • వెంటాడి మరీ కాల్పులు.. ఆపై తప్పు తెలుసుకుని పరార్
హర్యానాలోని ఫరీదాబాద్‌లో దారుణం జరిగింది. ఆవులను స్మగ్లింగ్ చేస్తున్నాడని భ్రమపడి 12వ తరగతి విద్యార్థిని 30 కిలోమీటర్లు వెంటాడి కాల్చి చంపారు. ఆగస్టు 23న జరిగిన ఈ ఘటనకు సంబంధించి గో సంరక్షణ గ్రూపులోని ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులను అనిల్ కౌశిక్, వరుణ్, కృష్ణా, ఆదేశ్, సౌరభ్‌గా గుర్తించారు.

బాధితుడు ఆర్యన్ మిశ్రా, ఆయన స్నేహితులు షాంకీ, హర్షిత్‌లను నిందితులు పశువుల స్మగ్లర్లుగా పొరబడి ఈ దారుణానికి తెగబడ్డారు. ఢిల్లీ-ఆగ్రా జాతీయ రహదారిపై కారులో 30 కిలోమీటర్లు వారిని వెంబడించి మరీ కాల్పులు జరిపి విద్యార్థిని పొట్టనపెట్టుకున్నారు.

రెనాల్డ్ డస్టర్, టొయోటా ఫార్చునర్ కార్లలో వచ్చిన స్మగ్లర్లు పశువులను ఎత్తుకుపోతున్నట్టు సమాచారం అందుకున్న గో సంరక్షకులు వారి కోసం వెతుకుతూ రోడ్డెక్కారు. పటేల్ చౌక్ వద్ద డస్టర్ కారును చూసిన నిందితులు.. కారును ఆపమని డ్రైవర్ హర్షిత్‌ను కోరారు. అయితే, తమకు కొందరితో శత్రుత్వం ఉండడంతో చంపేందుకు గూండాలను పంపి ఉంటారని భావించిన ఆర్యన్, ఆయన స్నేహితులు కారు ఆపకుండా వెళ్లారు. 

దీంతో వారు నిజంగానే గోవులను తరలిస్తున్నారని భావించిన ఓ నిందితుడు కారుపై కాల్పులు జరిపారు. ఓ తూటా పాసింజర్ సీట్లో ఉన్న ఆర్యన్‌ మెడ నుంచి దూసుకెళ్లింది. నిందితుడు మరోమారు కాల్పులు జరిపడంతో కారు ఆగింది. అయితే బాధితుల కారులో ఇద్దరు మహిళలు ఉండడం చూసిన నిందితులు తాము తప్పుగా కాల్పులు జరిపినట్టు అర్థం చేసుకుని అక్కడి నుంచి పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన ఆర్యన్ ను ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు. నిందితులు ప్రస్తుతం కస్టడీలో ఉన్నారని, దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.
Cow Smuggler
12th Student
Haryana
Shot Dead
Crime News

More Telugu News