Revanth Reddy: లక్ష కోట్లు వెనకేశారు.. వరదబాధితులకు 2 వేల కోట్లు ఇవ్వొచ్చుగా: కేసీఆర్ పై రేవంత్ రెడ్డి సెటైర్
- ప్రతిపక్ష నేతలపై విరుచుకుపడ్డ తెలంగాణ ముఖ్యమంత్రి
- అమెరికాలో ఉన్న కేటీఆర్ ట్వీట్టర్ లో రాజకీయం చేస్తున్నాడని ఫైర్
- పువ్వాడ అజయ్ ఆక్రమణల గుట్టు తేల్చేద్దాం రమ్మంటూ హరీశ్ రావుకు సవాల్
- కేంద్రం నుంచి నిధులు ఇప్పించాలంటూ ఈటల రాజేందర్ కు హితవు
‘పదేళ్ల పాలనలో రూ.లక్ష కోట్లు వెనకేశారు.. రాష్ట్ర ప్రజలు వరదలతో అతలాకుతలం అవుతున్న ఈ పరిస్థితిలో కనీసం రూ.2 వేల కోట్లన్నా సీఎం సహాయ నిధికి ఇవ్వొచ్చు కదా’ అంటూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సెటైర్ వేశారు. మంగళవారం ఉదయం రేవంత్ రెడ్డి మహబూబాబాద్ జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై, బీజేపీ నాయకులపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో పర్యటించి వరద సాయం చేయాలంటూ ప్రధాని నరేంద్ర మోదీకి ఆయన విజ్ఞప్తి చేశారు. గత బీఆర్ఎస్ పాలనలో కనీవినీ ఎరగని అవినీతి చోటుచేసుకుందన్నారు.
కేసీఆర్ కుటుంబం వద్ద రూ.లక్ష కోట్లు ఉన్నాయని ఆరోపించారు. అందులో కనీసం రూ. వేల కోట్లు విరాళం ఇవ్వాలని హితవు పలికారు. రాష్ట్రంలో వరదల వల్ల ప్రజలు ఇబ్బంది పడుతుంటే మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ అమెరికాలో పర్యటిస్తున్నారని విమర్శించారు. అక్కడి నుంచి ట్విట్టర్ లో రాజకీయం చేస్తున్నాడంటూ మండిపడ్డారు. మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శలను తిప్పికొడుతూ.. ఖమ్మంలో పువ్వాడ అజయ్ అక్రమాల గుట్టు తేల్చేద్దాం రమ్మంటూ రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. వరదల్లో మృతి చెందిన కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని, ఒక్కో కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం ఇవ్వాలని బీజేపీ నేత, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ చేసిన విజ్ఞప్తిపై స్పందిస్తూ.. ఆ నిధులు కేంద్రం నుంచి మీరే ఇప్పించాలని కోరారు.
మున్నేరు రిటైనింగ్ వాల్ పై త్వరలో నిర్ణయం..
మహబూబాబాద్ జిల్లాలో వరద నీటిలో కొట్టుకుపోయిన యువ శాస్త్రవేత్త కుటుంబాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరామర్శించారు. నీట మునిగిన ప్రాంతాల్లో పర్యటించి బాధితులతో మాట్లాడారు. ప్రభుత్వం అప్రమత్తంగా ఉండటం వల్లే పెద్ద నష్టం తప్పిందని రేవంత్ రెడ్డి చెప్పారు. విపత్తుకు కారణమైన మున్నేరు రిటైనింగ్ వాల్‌పై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన మిషన్ కాకతీయ పథకంలో భారీగా దోపిడీ జరిగిందని ఆరోపించారు. అందుకే ఈ స్థాయిలో చెరువులు తెగాయని రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు.