G. Kishan Reddy: రాష్ట్ర ప్రభుత్వం నివేదిక ఇస్తే కేంద్రం నిధులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది: కిషన్ రెడ్డి
- వరదల్లో చనిపోయిన వారికి రూ.3 లక్షలు అందిస్తామన్న కేంద్రమంత్రి
- రేవంత్ రెడ్డి ప్రకటించిన రూ.5 లక్షల్లో కేంద్రం వాటాను కలిపారా? అని ప్రశ్న
- ఆసుపత్రుల్లో ఉన్న వారికి కేంద్రం నుంచి ఖర్చులు ఇస్తామని వెల్లడి
తెలంగాణలో వర్షాలు, వరదల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయి నివేదిక ఇస్తే కేంద్ర ప్రభుత్వం అందుకు అనుగుణంగా తగిన నిధులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు.
హైదరాబాద్‌లోని బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... వరదల్లో చనిపోయిన వారికి కేంద్రం నుంచి రూ.3 లక్షలు అందిస్తామన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రూ.5 లక్షలు ప్రకటించారని, మరి కేంద్రం ఇచ్చే రూ.3 లక్షలతో కలిపి ఇస్తారా? లేక వేరుగా ఇస్తారా? చెప్పాలన్నారు.
చికిత్స పొందుతున్న వారు ఆసుపత్రుల్లోనే వారం రోజుల కంటే ఎక్కువ ఉంటే రూ.16 వేలు, వారం రోజుల లోపు ఆసుపత్రిలో ఉంటే రూ.4 వేలు ఖర్చుల నిమిత్తం కేంద్రం అందిస్తుందన్నారు. ఎస్‌డీఆర్ఎఫ్ నిధులతో బాధితులను ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన కోరారు.
యుటిలైజేషన్ నిధులపై గత బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఎలాంటి నివేదికలు విడుదల చేయలేదని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఎస్డీఆర్ఎఫ్ కింద రూ.1,300 కోట్లకు పైగా నిధులు ఉన్నాయన్నారు. మరో రూ.200 కోట్లు యూసీ నిధులు ఉన్నాయని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం నివేదిక సమర్పిస్తే కేంద్రం నిధులు విడుదల చేస్తుందన్నారు. రాష్ట్రంలో అంటువ్యాధులు సోకకుండా మందులు పంపిణీ చేయాలని సూచించారు. సెప్టెంబర్ 17 ఉత్సవాలపై రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేసిందని ధ్వజమెత్తారు. అందుకే కేంద్రం నిర్వహించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు.