Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబు రేపల్లె పర్యటన రద్దు
- వాతావరణం అనుకూలించకపోవడంతో నిర్ణయం
- విజయవాడ కలెక్టరేట్ లో అధికారులతో సమీక్ష
- కాలనీలు, ఇళ్లల్లో బురదను తొలగించాలని సిబ్బందికి ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు బుధవారం చేపట్టాల్సిన రేపల్లె పర్యటనను రద్దు చేసుకున్నారు. వరద ప్రభావాన్ని అంచనా వేసేందుకు ఏరియల్ సర్వే నిర్వహించాలని భావించినా.. వాతావరణం అనుకూలించకపోవడంతో రద్దు చేశారు. బుధవారం ఉదయం విజయవాడ కలెక్టరేట్ లో వరద బాధితులకు సహాయ కార్యక్రమాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆహార పంపిణీ, పారిశుద్ధ్య కార్యక్రమాలపై ఆరా తీశారు. బాధితులకు వైద్య సాయం అందించడంలో ఎలాంటి వైఫల్యాన్ని సహించబోనని అధికారులకు తేల్చిచెప్పారు.
వరద కారణంగా కాలనీలు, ఇళ్లల్లో పేరుకుపోయిన బురదను తొలగించాలని పారిశుద్ధ్య సిబ్బందిని ఆదేశించారు. కాగా, మంగళవారం వరద ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటించిన విషయం తెలిసిందే. వాహనాలు వెళ్లే పరిస్థితి లేకపోవడంతో సీఎం చంద్రబాబు జేసీబీలో కూర్చుని లోతట్టు ప్రాంతాల ప్రజలను పరామర్శించారు. జక్కంపూడి, సింగ్ నగర్, సితార సెంటర్ ప్రాంతాల్లో పర్యటించి అక్కడి ప్రజల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం తరఫున సాయం చేస్తామని వారికి హామీ ఇచ్చారు.