Ram Charan: వరద బాధితుల సహాయార్థం కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించిన రామ్ చరణ్
- భారీ వర్షాలు, వరదలతో తెలుగు రాష్ట్రాలు అతలాకుతలం
- ఆదుకునేందుకు ముందుకు వచ్చిన చిత్ర పరిశ్రమ
- భారీ విరాళం ప్రకటించిన రామ్ చరణ్
- తెలంగాణకు రూ.50 లక్షలు, ఏపీకి రూ.50 లక్షల విరాళం
వరద బీభత్సంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఊహించని విధంగా ఆస్తినష్టం జరిగింది. వీరిని ఆదుకోవటానికి రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు కష్టపడుతున్నాయి. ఇప్పుడు ఇలాంటి వారికి తమ వంతు సాయంగా నిలవటానికి తెలుగు చిత్ర పరిశ్రమ ముందుకు వచ్చింది.
ఈ క్రమంలో హీరో రామ్ చరణ్ సైతం తనవంతుగా కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించారు. ఇందులో ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి రూ.50 లక్షలు, తెలంగాణ ప్రభుత్వానికి రూ.50 లక్షలు విరాళంగా ఇస్తున్నట్లు తెలిపారు.
‘‘వర్షాలు, వరదల వల్ల ఇబ్బందులు పడుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు మనం తోడుగా, అండగా ఉన్నామంటూ చేయూత అందించాల్సిన సమయం ఇది. నా వంతు బాధ్యతగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్ కు కోటి రూపాయలు విరాళంగా ప్రకటిస్తున్నాను. తెలుగు రాష్ట్రాల ప్రజలు ఈ పరిస్థితి నుంచి త్వరగా బయటపడాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను’’ అని రామ్ చరణ్ పేర్కొన్నారు.
కాగా, తండ్రి చిరంజీవి లాగానే సేవా బాటలో ప్రయాణిస్తూ రామ్ చరణ్ తెలుగు వారి కోసం కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించటంపై నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు.