Harish Rao: రేవంత్ రెడ్డిపై హరీశ్ రావు తీవ్ర ఆగ్రహం

Harish Rao fires at Revanth Reddy

  • ఊపిరి ఉన్నంత వరకు సిద్దిపేట అభివృద్ధి కోసం కృషి చేస్తానన్న మాజీ మంత్రి
  • సిద్దిపేట అభిృవద్ధిని ఓర్వలేక అడ్డుకునే ప్రయత్నం చేస్తోందని ధ్వజం
  • ప్రతిపక్షాలపై కాంగ్రెస్ దాడులు, కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆగ్రహం

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన వద్ద వ్యంగ్యం తప్ప పరిపాలన లేదని విమర్శించారు. 

సిద్దిపేటలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తన ఊపిరి ఉన్నంత వరకు సిద్దిపేట అభివృద్ధి కోసం కృషి చేస్తానన్నారు. తన నియోజకవర్గం అభివృద్ధిని ఓర్వలేక అధికార పార్టీ అడ్డుకునే ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు. పోరాడి అభివృద్ధి చేస్తానన్నారు.

ప్రతిపక్షాలపై కాంగ్రెస్ దాడులు, కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని విమర్శించారు. అరచేతిలో వైకుంఠం చూపించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ రాష్ట్రాన్ని నాశనం చేస్తోందన్నారు. 

ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో తమ ఎమ్మెల్యేలు ఆదుకోవడానికి వరద ప్రభావిత ప్రాంతాలకు వెళితే కాంగ్రెస్ పార్టీ దాడులకు పాల్పడిందని మండిపడ్డారు. ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారన్నారు.

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలల కాలంలో అభివృద్ధి కోసం ఒక్క రూపాయి ఖర్చు చేయలేదని ధ్వజమెత్తారు. కేసీఆర్ ఆశీర్వాదంతోనే రాష్ట్రంలోనే సిద్దిపేటను ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దామన్నారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలన కాలంలో సిద్దిపేటకు ఎన్నో తెచ్చుకున్నామన్నారు. సిద్దిపేటలో సగం నిర్మాణం పూర్తయిన వెటర్నరీ కాలేజీని రేవంత్ రెడ్డి కొడంగల్ తరలించుకుపోయారని ఆరోపించారు.

  • Loading...

More Telugu News