YS Sharmila: కొంప కొల్లేరు... బెజవాడ బుడమేరు: షర్మిల
- సింగ్ నగర్ లో వరద బాధితులను పరామర్శించిన షర్మిల
- వరదలకు బుడమేరే కారణమని వ్యాఖ్య
- హైడ్రా మాదిరి బుడమేరు ఆక్రమణలను తొలగించాలని సూచన
ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విజయవాడలోని వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించారు. వరద ముంపునకు గురైన సింగ్ నగర్ ప్రాంతంలోని బాధితులను ఆమె పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... వరద బాధితులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని కోరారు.
వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి పర్యటిస్తూ ప్రజలకు ధైర్యం చెపుతుండటం మంచి విషయమని చెప్పారు. విజయవాడ వరదలకు బుడమేరే కారణమని అన్నారు.
కొంప కొల్లేరయిందని... బెజవాడ బుడమేరు అయిందని షర్మిల వ్యాఖ్యానించారు. బుడమేరు ద్వారా వచ్చే వరద నీరు కొల్లేరుకు చేరేలా చర్యలు చేపట్టాలని సూచించారు. మరోసారి ఇలాంటి విపత్తు రాకుండా చూడాల్సిన బాధ్యత సీఎం చంద్రబాబుపై ఉందని చెప్పారు. బుడమేరు రక్షణకు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. తెలంగాణలో హైడ్రా తరహాలో... బుడమేరు ఆక్రమణలను కూడా వెంటనే తొలగించాలని అన్నారు. బుడమేరుకు రిటైనింగ్ వాల్ కట్టాలని సూచించారు.
ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వంపై షర్మిల మండిపడ్డారు. ఏపీ ఎంపీల మద్దతుతోనే పీఎం అయ్యాననే సంగతి మోదీ మర్చిపోయారని విమర్శించారు. మోదీ వెంటనే స్పందించి వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. వరదల కారణంగా నష్టపోయిన ప్రతి ఇంటికి రూ. 1 లక్ష చొప్పున పరిహారం అందించాలని కోరారు.