Maoist Jagan: మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ.. అగ్రనేత జగన్ మృతి

A huge setback for Maoists as Top leader Jagan died in Bijapur Encounter
  • బీజాపూర్‌ ఎన్‌కౌంటర్‌లో కన్నుమూత
  • 35 ఏళ్లపాటు అజ్ఞాతంలో ఉన్న జగన్
  • అసలు పేరు మాచర్ల ఏసోబు
  • జగన్‌పై రూ. 25 లక్షల రివార్డు
ఇటీవల వరుసగా జరుగుతున్న ఎన్‌కౌంటర్లలో పెద్ద సంఖ్యలో కేడర్ ను, కీలక వ్యక్తులను కోల్పోతున్న మావోయిస్టులకు తాజాగా మరో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. అగ్రనేత జగన్ మృతి చెందాడు. రెండు రోజుల క్రితం ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌-బస్తర్‌ జిల్లాల మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని పోలీసులు ప్రకటించారు. మంగళవారం జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌లో 9 మంది మృతి చెందగా.. అందులో జగన్ కూడా ఉన్నట్టు బుధవారం నిర్ధారించారు. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్న జగన్ అసలు పేరు మాచర్ల ఏసోబు అలియాస్‌ రణ్‌దేవ్‌ దాదా. ఈయన స్వగ్రామం హనుమకొండ జిల్లా కాజీపేట మండలంలోని టేకులగూడం.

జగన్‌ డెడ్‌బాడీని ఛత్తీస్‌గఢ్ నుంచి స్వస్థలానికి తీసుకొచ్చేందుకు ఆయన కొడుకు మహేశ్‌ బయలుదేరినట్టు తెలుస్తోంది. ఇక గురువారం మధ్యాహ్నానికి మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చే అవకాశం ఉందని సమాచారం. నివాళులు అర్పించేందుకు పెద్ద సంఖ్యలో మాజీ నక్సలైట్లు, హక్కుల కార్యకర్తలు తరలి రావొచ్చని కథనాలు వెలువడుతున్నాయి.

జగన్ దాదాపు 35 ఏళ్లు అనేక దాడులు, ఉద్యమాల్లో పాల్గొన్నారు. అంచెలంచెలుగా ఎదిగి అనేక హోదాల్లో పనిచేశారు. తొలుత ఆర్గనైజర్‌గా, కమాండర్‌గా పనిచేశారు. 1995లో వరంగల్‌ జిల్లా కమిటీ సభ్యుడిగా పనిచేశారు. ఆ తర్వాత తెలంగాణ కమిటీ ప్రెస్‌, రక్షణ వ్యవహారాల ప్లటూన్‌ కమాండర్‌గా, కేంద్ర కమిటీ రక్షణ కమాండర్‌గా, ఛత్తీ‌స్‌గఢ్‌లో జనతన సర్కార్‌ (సమాంతర ప్రభుత్వం)లో వ్యవసాయాభివృద్ధి కమిటీ నేతగా, ఆ తర్వాత కేంద్ర కమిటీ సభ్యుడిగా, మహారాష్ట్ర-ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దు ఇన్‌చార్జిగా, కేంద్ర కమిటీ మిలటరీ ఇన్‌చార్జిగా ఇలా వివిధ హోదాల్లో పనిచేశారు. ఆయనపై రూ.25 లక్షల రివార్డు కూడా ఉంది. జగన్‌ అజ్ఞాతంలోకి వెళ్లిన తర్వాత ఒక్కసారి కూడా స్వగ్రామం టేకులగూడెం రాలేదని గ్రామస్థులు చెబుతున్నారు.

చర్చి ఫాస్టర్ నుంచి మావోయిస్టుగా..
బీజాపూర్ ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన మావోయిస్టు అగ్రనేత జగన్ దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. భూస్వామ్య వ్యతిరేక ఉద్యమాలకు ఆకర్షితుడై 1990లో పీపుల్స్‌ వార్‌ గ్రూప్‌ నేత కడారి రాములు అలియాస్‌ రవి నేతృత్వంలో మావోయిస్టుగా మారి అజ్ఞాతంలోకి వెళ్లారు. అయితే మావోయిస్టుగా మారడానికి ముందు చర్చి పాస్టర్‌గా పనిచేశారు. రైతు ఉద్యమాల్లో పాల్గొనేవారు. కాగా మావోయిస్టుగా మారిన తర్వాత తొలుత వరంగల్‌ జిల్లా అన్నాసాగర్‌ ఏరియా కమిటీ సభ్యుడిగా పనిచేశారు.
Maoist Jagan
Macharla Yosobhu
Bijapur Encounter
Chhattisgarh

More Telugu News