Chandrababu: కొద్ది సమయంలోనే చరిత్రలో చూడని వర్షం కురిసింది: సీఎం చంద్రబాబు

CM Chandrababu press meet along with union minister Shivraj Singh Chouhan
  • కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తో కలిసి చంద్రబాబు ప్రెస్ మీట్
  • రెండ్రోజుల్లోనే 40 సెం.మీ వర్షపాతం నమోదైందని వెల్లడి
  • ఎగువ నుంచి కృష్ణానదికి భారీ వరద వచ్చిందని వివరణ
  • దానికితోడు బుడమేరు ఉప్పొంగిందని స్పష్టీకరణ
ఇవాళ రాష్ట్రానికి వచ్చిన కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తో సమావేశం అనంతరం సీఎం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. ప్రకాశం బ్యారేజి సామర్థ్యం పెంచేందుకు అధ్యయనం చేపడతామని వెల్లడించారు. 15 లక్షల క్యూసెక్కుల నీటి ప్రవాహం వచ్చినా తట్టుకునేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. కృష్ణా నది కరకట్టలు మరింత పటిష్టం చేస్తామని పేర్కొన్నారు. 

11.90 లక్షల క్యూసెక్కుల సామర్థ్యంతో ప్రకాశం బ్యారేజిని 100 ఏళ్ల కిందట డిజైన్ చేశారని, అయితే, ఇటీవల కురిసిన వర్షాలకు 11.43 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చిందని వివరించారు. కృష్ణా నదికి ఎగువన నాగార్జున సాగర్, పులిచింతల, జూరాల, శ్రీశైలం, ఆల్మట్టి వంటి ప్రాజెక్టులు కట్టారని వెల్లడించారు. 

ప్రస్తుతం వాతావరణంలో విపరీతమైన మార్పులు వచ్చాయని, క్లౌడ్ బరస్ట్ వంటి పరిణామాలు చోటుచేసుకుంటున్నాయని, కొద్దిసమయంలోనే విపరీతమైన వర్షపాతం నమోదవుతోందని చంద్రబాబు పేర్కొన్నారు. 

విజయవాడ ప్రాంతంలో రెండ్రోజుల్లోనే 40 సెంటీమీటర్ల వర్షం కురిసిందని తెలిపారు. దానికితోడు కృష్ణా నది పరీవాహక ప్రాంతాల్లో ఎగువన కురిసిన వర్షాలతో భారీగా వరద వచ్చిందని వెల్లడించారు. మరోవైపు 10 వేల క్యూసెక్కుల నీటి ప్రవాహం కోసం డిజైన్ చేసిన బుడమేరులో 35 వేల క్యూసెక్కుల నీరు వచ్చిందని చంద్రబాబు తెలిపారు. 

ఊహించని స్థాయిలో వర్షాలు పడడమే కాకుండా, మానవ తప్పిదం వల్ల కూడా విజయవాడ వరదలు సంభవించాయని అన్నారు. 

2019లో బుడమేరు కోసం ఐదు పనులు కేటాయిస్తే వాటిని రద్దు చేశారని, మూడు గండ్లు పడితే వాటిని పూడ్చలేకపోయారని ఆరోపించారు. ఇప్పటికే ఒక టెక్నికల్ టీమ్ వచ్చిందని, పరిశీలన చేపడుతోందని వివరించారు. బుడమేరు గండ్లు పూడ్చేందుకు ఆర్మీ రంగంలోకి దిగుతోందని వెల్లడించారు. గండ్లు పూడ్చే పనుల్లో ఆర్మీ రేపటి నుంచే పాల్గొంటుందని తెలిపారు.
Chandrababu
Shivraj Singh Chouhan
Prakasam Barrage
Krishna River
Vijayawada

More Telugu News