Jitta Balakrishna Reddy: జిట్టా బాలకృష్ణారెడ్డి మృతి దిగ్భ్రాంతిని కలిగించింది: రేవంత్ రెడ్డి, కేటీఆర్
- తెలంగాణ ఉద్యమంలో ఆయన కీలక పాత్ర పోషించారన్న సీఎం
- తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారని వ్యాఖ్య
- జిట్టా మరణం బీఆర్ఎస్‌కు తీరని లోటు అన్న కేటీఆర్
తెలంగాణ ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణారెడ్డి మరణం తనకు దిగ్భ్రాంతిని కలిగించిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. జిట్టా మృతిపై ఆయన ఎక్స్ వేదికగా సంతాపం తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో ఆయన కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారని కొనియాడారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. జిట్టా కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
జిట్టా అకాల మృతి దిగ్భ్రాంతికి గురి చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. జిట్టా కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన మరణం బీఆర్ఎస్‌కు తీరని లోటు అన్నారు. సొంత ఆస్తులను కూడా లెక్కచేయకుండా తెలంగాణ ఉద్యమ నిర్మాణానికి ఎంతో కృషి చేశారన్నారు.
తెలంగాణ ఏర్పాటు కోసం అనేక పోరాటాల్లో కలిసి పని చేశామని హరీశ్ రావు గుర్తు చేసుకున్నారు. భువనగిరి ప్రాంత ప్రజల కోసం ఆయన ఎంతో తపన పడేవారన్నారు. బీఆర్ఎస్ యువజన విభాగం పటిష్టానికి ఆయన ఎంతో కృషి చేశారని వెల్లడించారు. జిట్టా కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
బీఆర్ఎస్ నేత జిట్టా బాలకృష్ణారెడ్డి (52) కొన్నాళ్లుగా మెదడు సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో కన్నుమూశారు.