Shivaraj Singh: ఖమ్మంలో శివరాజ్ సింగ్ చౌహాన్ ఏరియల్ సర్వే... రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కితాబు

Union Minister Chouhan undertakes aerial survey of flood hit Khammam
  • ఖమ్మం, పాలేరు, మధిర ముంపు ప్రాంతాల్లో ఏరియల్ సర్వే
  • రైతులతో మాట్లాడిన కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్
  • రాష్ట్ర ప్రభుత్వం నివారణ చర్యలతో ప్రాణనష్టం చాలా వరకు తగ్గిందన్న కేంద్రమంత్రి
  • ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు కేంద్రం రూ.3,300 కోట్లు విడుదల
కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు తెలంగాణలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. కేంద్ర సహాయమంత్రి బండి సంజయ్, తెలంగాణ ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్కతో కలిసి ఖమ్మం జిల్లాలోని ఖమ్మం, పాలేరు, మధిర ముంపు ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. 

మున్నేరు వాగు పొంగడంతో ముంపునకు గురైన ప్రాంతాలను కేంద్రమంత్రి పరిశీలించారు. పాలేరు మెయిన్ కెనాల్ వద్ద హెలికాప్టర్ ల్యాండైంది. అక్కడ కాల్వ తెగిపోవడంతో ఖమ్మం-సూర్యాపేట జాతీయ రహదారికి జరిగిన నష్టాన్ని కేంద్రమంత్రికి భట్టివిక్రమార్క చూపించారు.

ఆ తర్వాత రైతులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బండి సంజయ్‌తో పాటు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. వరదల కారణంగా తాము సర్వస్వం కోల్పోయామని రైతులు కేంద్రమంత్రికి తమ గోడును వెళ్లబోసుకున్నారు. ఓ రైతు తనకు జరిగిన నష్టాన్ని వివరిస్తుండగా... కేంద్రమంత్రి కుర్చీలో నుంచి లేచి నిలబడి ఆ రైతును వేదిక పైకి పిలిచి ఓదార్చారు.

తాను కూడా రైతునేనని, తనకు రైతుల కష్టాలు తెలుసునని కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. 100 ఏళ్లలో ఎన్నడూ లేనివిధంగా వరదలు వచ్చాయని, దీంతో వరి, మిర్చి వంటి పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు.

ఇలాంటి సంక్షోభ సమయంలో రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. రాష్ట్రంలోని గత ప్రభుత్వం కేంద్రం నిధులను దారి మళ్లించిందని ఆరోపించారు. తాను రాజకీయాల కోసం ఇక్కడకు రాలేదని, ప్రజలకు సేవ చేసేందుకు వచ్చానన్నారు.

రాష్ట్ర ప్రభుత్వంపై శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రశంసలు

రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న నివారణ చర్యల కారణంగా ప్రాణనష్టం చాలా వరకు తగ్గిందని శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. కాగా, రైతులతో మాట్లాడిన అనంతరం బండి సంజయ్‌తో కలిసి హైదరాబాద్ చేరుకున్నారు. సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డితో కలిసి సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. కాగా, తెలుగు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం రూ.3,300 కోట్ల వరద సాయాన్ని విడుదల చేసింది.
Shivaraj Singh
BJP
Khammam District
Telangana
Bandi Sanjay

More Telugu News