Amit Shah: ఆర్టికల్ 370 ముగిసిన ఘట్టం... దానిని పునరుద్ధరించే ప్రసక్తి లేదు: అమిత్ షా
- జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల కోసం మేనిఫెస్టోను విడుదల చేసిన బీజేపీ
- ఉగ్రవాదం, వేర్పాటువాదాన్ని తుడిచిపెట్టడమే లక్ష్యమన్న అమిత్ షా
- జమ్మూ కశ్మీర్ కు బీజేపీ ఎప్పుడూ ప్రాధాన్యత ఇస్తోందన్న బీజేపీ
ఆర్టికల్ 370 ఒక ముగిసిన ఘట్టమని, దానిని పునరుద్ధరించే ప్రసక్తే లేదని కేంద్రమంత్రి అమిత్ షా అన్నారు. జమ్మూ కశ్మీర్లో ఎన్నికల నేపథ్యంలో బీజేపీ మేనిఫెస్టోను విడుదల చేసింది. ఇందులో 25 తీర్మానాలు ప్రకటించారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ... ఈ తీర్మానాలలో ఉగ్రవాదం, వేర్పాటువాదాన్ని తుడిచిపెట్టడం మొదటిది అన్నారు. మహిళల ఆర్థిక స్వావలంబన, భద్రతకు అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు చెప్పారు.
శాంతియుత, సురక్షిత, సుసంపన్నమైన జమ్మూ కశ్మీర్ తమ లక్ష్యమని పేర్కొన్నారు. కశ్మీర్ కు బీజేపీ ఎప్పుడూ ప్రాధాన్యతను ఇస్తోందన్నారు. 2014 వరకు వేర్పాటువాదం, ఉగ్రవాదం నీడన ఉన్న జమ్మూ కశ్మీర్ ఆ తర్వాత దాని నుంచి బయటపడిందన్నారు.
కొంతమంది నాయకులు ఇక్కడ అస్థిరతను సృష్టించే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. జమ్మూ కశ్మీర్ చరిత్ర రాస్తే 2014 తర్వాత పదేళ్ల కాలం గోల్డెన్ పీరియడ్‌గా నిలిచిపోతుందని పేర్కొన్నారు.