Chandrababu: బుడమేరు మూడో గండిని ఈ రాత్రికే పూడ్చేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నాం: సీఎం చంద్రబాబు
- విజయవాడలో సీఎం చంద్రబాబు ప్రెస్ మీట్
- బుడమేరు గండ్లు పూడ్చడమే తమ ప్రధాన లక్ష్యమని స్పష్టీకరణ
- ఏరియల్ సర్వేలో కృష్ణా నది సముద్రంలో కలిసే ప్రాంతం వరకు చూశానని వెల్లడి
- యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టామని వివరణ
ఏపీ సీఎం చంద్రబాబు విజయవాడలో మీడియాతో మాట్లాడారు. వరద ప్రాంతాల్లో ఇవాళ ఏరియల్ సర్వే చేశానని, బుడమేరుకు గండ్లు పడిన ప్రాంతాన్ని పరిశీలించానని చంద్రబాబు వెల్లడించారు. బుడమేరుకు గండ్లు పడిన ప్రాంతాలను, ముంపు ప్రాంతాలను పరిశీలించానని, కృష్ణా నది సముద్రంలో కలిసే ప్రాంతం వరకు చూశానని తెలిపారు.
ముందు బుడమేరుకు పడిన గండ్లు పూడ్చడమే తమ ముందున్న ప్రధాన లక్ష్యమని వెల్లడించారు. ఇప్పటిదాకా రెండు గండ్లు పూడ్చామని, మూడో గండి పూడ్చాల్సి ఉందని తెలిపారు. బుడమేరు మూడో గండి పూడ్చేందుకు సైన్యం కూడా వచ్చిందని చంద్రబాబు పేర్కొన్నారు. మూడో గండి ఎలాగైనా సరే ఈ రాత్రికే పూడ్చాలని సర్వశక్తులు ఒడ్డి పనిచేస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం పైనుంచి ప్రవాహం ఏమీ రావడంలేదని తెలిపారు.
విజయవాడ ముంపునకు గురికాగానే, యుద్ధ ప్రాతిపదికన వరద సహాయక చర్యలు చేపట్టామని, 149 పట్టణ, 30 గ్రామీణ సచివాలయాల నుంచి పనులు చేపట్టామని వివరించారు. వరద ప్రాంతాల్లో 72 శాతం పారిశుద్ధ్య పనులు పూర్తి చేశామని స్పష్టం చేశారు.
వరద ముంపు ప్రాంతాల్లో నీరు తగ్గుతోందని, వరద ముంపు ప్రాంతాల్లో వైద్య శిబిరాలు కొనసాగుతున్నాయని చంద్రబాబు చెప్పారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో 3.12 లక్షల ఆహార ప్యాకెట్లు, 11.5 లక్షల వాటర్ బాటిళ్లు పంపిణీ చేశామని వివరించారు. పాలు, బిస్కెట్లు, కొవ్వొత్తులు, అవసరమైన ఇతర వస్తువులు పంపిణీ చేశామని వెల్లడించారు.
వరద ప్రాంతాల్లో 7,100 మంది పారిశుద్ధ్య సిబ్బంది పనిచేస్తున్నారని చంద్రబాబు తెలిపారు. నీరు నిల్వ ఉన్న చోట్ల తప్ప, మిగతా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా పునరుద్ధరించామని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మొత్తం విద్యుత్ సరఫరా పునరుద్ధరించామని చెప్పారు.
వరద ప్రాంతాల్లో 1,300 రేషన్ వాహనాలు తిరుగుతున్నాయని, వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉచిత బస్సులు ఏర్పాటు చేశామని చంద్రబాబు వివరించారు. ప్రస్తుతం ఎలక్ట్రీషియన్లు, ప్లంబర్లు, మెకానిక్కులు, ఇతర టెక్నీషియన్ల అవసరం నెలకొందని పేర్కొన్నారు. వరద ప్రాంతాల్లో సేవలు మెరుగ్గా అందించే ఏజెన్సీలకు రేటింగ్ ఇస్తామని అన్నారు.