Vinesh Phogat: ఒలింపిక్స్‌లో అనర్హత వేటు వెనుక రాజకీయ కుట్ర ఉందా? అంటే వినేశ్ ఫొగట్ సమాధానం ఇదీ...!
- ఈ అంశంపై మున్ముందు వివరంగా మాట్లాడుతానన్న వినేశ్ ఫొగట్
- తాను స్పందించే వరకు వేచి ఉండాలని మీడియాకు విజ్ఞప్తి
- తమ పోరాటం ఇంకా ముగియలేదన్న వినేశ్ ఫొగట్
ఒలింపిక్స్‌లో అధిక బరువు కారణంగా అనర్హత వేటు పడటంతో తృటిలో మెడల్ కోల్పోయిన వినేశ్ ఫొగట్ ఈ అంశంపై స్పందించేందుకు నిరాకరించారు. అయితే మున్ముందు దీని గురించి పూర్తి వివరాలతో మాట్లాడుతానని వెల్లడించారు. బజరంగ్ పునియాతో కలిసి ఫొగట్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సమయంలో మీడియా ప్రతినిధులు 'అధిక బరువు' అంశంపై అడిగారు. ఇందులో రాజకీయ కుట్ర ఉందని భావిస్తున్నారా? అని ప్రశ్నించారు.
దీనికి ఫొగట్ స్పందిస్తూ... ఆ సందర్భం ఎంతో ఉద్వేగభరితమైనది అన్నారు. ఈ అంశంపై తాను మున్ముందు సవివరంగా మాట్లాడుతానని వెల్లడించారు. ఈ అంశంపై తాను స్పందించే వరకు వేచి ఉండాలని మీడియాను కోరారు.
భారత రెజ్లింగ్ సమాఖ్య మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై పలువురు మహిళా రెజ్లర్లు లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన సమయంలో జరిగిన నిరసనల అంశంపై కూడా ఆమె స్పందించారు.
నిరసన సమయంలో తమను రోడ్డు మీద ఈడ్చుకెళ్లినప్పుడు బీజేపీ మినహా తమకు అన్ని పార్టీలు అండగా నిలిచాయని గుర్తు చేసుకున్నారు. మా కన్నీళ్లను కాంగ్రెస్ పార్టీ అర్థం చేసుకుందన్నారు. తమ పోరాటం ఇంకా ముగిసిపోలేదని, ప్రస్తుతం ఆ అంశం కోర్టు పరిధిలో ఉందన్నారు. న్యాయం కచ్చితంగా గెలుస్తుందని నమ్మకం ఉందన్నారు. పోరాటం చేసేందుకు తమకు ఇప్పుడు మరో వేదిక దొరికిందని తెలిపారు.