Brij Bhushan: నాటి కుట్ర నేడు బట్టబయలైంది.. వినేశ్ ఫొగాట్ రాజకీయ ప్రవేశంపై బ్రిజ్ భూషణ్ విమర్శ

Brij Bhushan takes cheating dig at Vinesh Phogat cites Olympic weight row
  • పతకం దక్కకుండా దేవుడే ఆమెను శిక్షించాడని వ్యాఖ్య
  • ఒలింపిక్స్ కు వెళ్లడానికి చీటింగ్ చేసిందని ఆరోపణ
  • పునియా ట్రయల్స్ లేకుండానే ఏషియన్ గేమ్స్ కు వెళ్లాడని విమర్శ
వినేశ్ ఫొగాట్, భజరంగ్ పునియాలు కాంగ్రెస్ తో కలిసి తనకు వ్యతిరేకంగా పన్నిన కుట్ర నేడు బట్టబయలైందని రెజ్లింగ్ ఫెడరేషన్ మాజీ అధ్యక్షుడు, బీజేపీ మాజీ ఎంపీ బ్రిజ్ భూషణ్ పేర్కొన్నారు. వీరిద్దరితో పాటు మరికొంతమంది రెజ్లర్లు తనకు వ్యతిరేకంగా 2023 జనవరి 18న ఆందోళన ప్రారంభించారని.. ఆ రోజే తాను అసలు విషయం చెప్పానన్నారు. కాంగ్రెస్ పార్టీతో కలిసి వారు తనకు వ్యతిరేకంగా కుట్ర చేస్తున్నారని చెప్పానని, ఆ కుట్ర నేడు బట్టబయలైందని వివరించారు. రాజకీయాల్లోకి రావడానికి కాంగ్రెస్ పార్టీతో కలిసి తనను బలిపశువును చేశారని మండిపడ్డారు.

హర్యానా మాజీ ముఖ్యమంత్రి భూపేందర్ హుడా, కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు ఈ కుట్రలో పాలుపంచుకున్నారని ఆరోపించారు. వినేశ్ ఫొగాట్, భజరంగ్ పునియాలు కాంగ్రెస్ పార్టీలో చేరడం.. వినేశ్ పార్టీ కండువా కప్పుకున్న గంటల వ్యవధిలోనే కాంగ్రెస్ పార్టీ ఆమెకు టికెట్ కేటాయించడమే దీనికి నిదర్శనమని అన్నారు. ఈమేరకు శనివారం బ్రిజ్ భూషణ్ మీడియాతో మాట్లాడుతూ.. పారిస్ ఒలింపిక్స్ లో పాల్గొనేందుకు వినేశ్ ఫొగాట్ మోసానికి పాల్పడిందని, అందుకే దేవుడు ఆమెకు పతకం దక్కకుండా శిక్షించాడని ఆరోపించారు. వినేశ్ ఒకేరోజు రెండు కేటగిరీలలో పాల్గొందని, 53 కిలోల కేటగిరిలో ఓటమి పాలయ్యాక 50 కిలోల కేటగిరీలో తలపడిందని గుర్తుచేశారు.

ఒకేరోజు రెండు వెయిట్ కేటగిరిలలో పాల్గొనడం నిబంధనలకు విరుద్ధమని ఆయన చెప్పారు. ఇక, భజరంగ్ పునియా విషయానికి వస్తే.. ఏషియన్ గేమ్స్ లో పాల్గొనే విషయంలో పునియా నిబంధనలను పట్టించుకోలేదని, ఎలాంటి ట్రయల్స్ లో పాల్గొనకుండా నేరుగా గేమ్స్ లో పాల్గొన్నాడని గుర్తుచేశారు. ఇలాంటి వారికి టికెట్ ఇచ్చి హర్యానా ఎన్నికల్లో గెలుస్తామని కాంగ్రెస్ కంటున్న కలలు కల్లలుగానే మిగులుతాయని బ్రిజ్ భూషణ్ జోస్యం చెప్పారు. కాగా, వినేశ్ ఫొగాట్, భజరంగ్ పునియా సహా రెజ్లర్లు చేసిన ఆరోపణలతో బ్రిజ్ భూషణ్ ను బీజేపీ పక్కన పెట్టిన విషయం తెలిసిందే.
Brij Bhushan
Vinesh Phogat
Bhajrang Punia
Congress
Athlets
Wrestlers
Paris Olympics

More Telugu News