Budameru: హమ్మయ్య.. బుడమేరు గండ్లు పూడ్చివేశారు
- శుక్రవారం నుంచి నిరంతరాయంగా శ్రమించిన అధికారులు
- మంత్రి నిమ్మల రామానాయుడు పర్యవేక్షణలో సాగిన పనులు
- ఏజెన్సీలకు ఆర్మీ తోడవడంతో పూర్తయిన గండ్ల పూడ్చివేత
విజయవాడలో వరదలకు కారణమైన బుడమేరు గండ్లను అధికారులు పూడ్చివేశారు. భారీ వర్షాలకు ప్రవాహం పెరిగి బుడమేరు వాగుకు మూడు గండ్లు పడగా.. విజయవాడను వరద ముంచెత్తింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో రంగంలోకి దిగిన జలవనరుల శాఖ అధికారులు బుడమేరు గండ్లను పూడ్చివేసేందుకు నిరంతరాయంగా శ్రమించారు. ఏజెన్సీల సాయంతో రెండు గండ్లను పూడ్చివేసిన అధికారులు.. మూడో గండిని పూడ్చేందుకు ఆర్మీ సాయం తీసుకున్నారు. ఉద్ధృతంగా వరద ఉన్నప్పుడే రెండు గండ్లను పూడ్చారు.
మంత్రి నిమ్మల రామానాయుడు పర్యవేక్షణలో శుక్రవారం నుంచి గండ్ల పూడ్చివేత పనులు నిరంతరాయంగా సాగాయి. మరో మంత్రి లోకేశ్ కూడా పనులను స్వయంగా పర్యవేక్షించారు. శనివారం మధ్యాహ్నానికి మూడో గండిని కూడా పూడ్చేయడంతో దిగువ ప్రాంతాలకు వరద నిలిచిపోయింది. కాగా, బుడమేరు డైవర్షన్ ఛానల్ కు ఒక్కసారిగా 60 వేల క్యూసెక్కుల వరద రావడం వల్లే గండ్లు పడ్డాయని అధికారులు తెలిపారు. ఈ గండ్లను పూడ్చివేసేందుకు ఏజెన్సీలతో పాటు చెన్నైకి చెందిన 6వ బెటాలియన్, సికింద్రాబాద్ కు చెందిన రెజిమెంటల్ బెటాలియన్ జవాన్లు కృషి చేశారని అధికారులు వివరించారు.